తెరపై తమతోపాటు, తమ సొంత గొంతు కూడా వినిపించినప్పుడే నటనకి పరిపూర్ణత వచ్చినట్టుగా భావిస్తుంటారు తారలు. అందుకే వీలైనంత వరకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. ఇటీవల కథానాయికలు ఒకట్రెండు సినిమాలకి భాష నేర్చేసుకొని డబ్బింగ్‌కి రెడీ అయిపోతున్నారు. అలా తమన్నా కూడా తొలి అడుగుల్లోనే తెలుగు భాషపై పట్టు పెంచుకొంది. డబ్బింగ్ చెప్పడానికి నేను రెడీనే అన్న సంకేతాల్ని పంపించింది. కానీ దర్శకులే ఆమెకి అవకాశం ఇవ్వలేదు. నిన్నమొన్న వచ్చిన కథానాయికలు కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం చూసి ఇక నేను ఆగలేనంటోంది తమన్నా. అందుకే 'ఊపిరి' కోసం సొంత గొంతు వినిపించేందుకు రెడీ అయిపోయింది. ఇటీవల విడుదలైన టీజర్‌లో తమన్నా గొంతే వినిపించింది. సినిమాలోనూ ఆమే డబ్బింగ్ చెప్పుకొంటోంది. తెలుగు ప్రేక్షకులకు తమన్నా డబ్బింగ్ స్పెషల్ అట్రాక్షన్ అవుతుండగా, తమళ్ ప్రేక్షకులు మాత్రం నాగార్జున డబ్బింగ్ గురించి మాట్లాడుకొంటున్నారు. ఊపిరి తమిళంలోనూ తెరకెక్కిన విషయం తెలిసిందే. అక్కడ నాగార్జున సొంతంగా డబ్బింగ్ చెప్పేసుకొన్నాడు. మరి ఆయన తమిళ మాటలు తంబీలకి ఎలా నచ్చుతాయో చూడాలి. ఇక తమన్నా తెలుగు గురించి తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సొంత గొంతు, సొంత నటనతో తమన్నా సమ్ థింగ్ స్పెషల్‌గా కనిపిస్తుందేమో అంటూ అందరూ ఊపిరికోసం ఎదురు చూస్తున్నారు.