బాలకృష్ణ ఏం చేసినా ఓ సంచలనమే. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడాయన. తెరపైనే కాదు.. బయట కూడా అంతే. ఇప్పుడు ప్రజాప్రతినిధి పాత్రలో జనంతో మమేకమై సాగుతున్న విధానం చూస్తే ముచ్చటేస్తుంది. గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టాడు కానీ... బాలయ్య భావాలు మాత్రం మధ్య తరగతికి అద్దం పట్టేలా ఉంటాయి. జనం మధ్య ఉండడానికే ఆయన ప్రాధాన్యమిస్తాడు. ప్రైవసీ అంటూ జనావాసాలకు దూరంగా షూటింగ్ జరుపుకొనే తారల్ని చాలామందిని చూస్తుంటాం. కానీ బాలయ్య అలా కాదు. జనం మధ్య సన్నివేశాలంటే రియల్‌గానే వాళ్ల మధ్యే తీసేద్దాం అంటుంటారు. అలా బాలయ్య నటించిన బోలెడన్ని చిత్రాలు రియల్ లొకేషన్లలోనే షూటింగ్ జరుపుకొన్నాయి. ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మారాక ఆయన స్టైల్ మరింతగా మారిపోయింది. జనం మనిషిని అంటూ నిత్యం వాళ్ల మధ్య గడపడానికే ప్రయత్నిస్తున్నాడు. సినిమా షూటింగ్ అవ్వగానే తన నియోజకవర్గమైన హిందూపురంలో ప్రత్యక్షమైపోతుంటాడు. వాళ్ల మంచి చెడుల్లో పాలు పంచుకొంటుంటాడు. ప్రస్తుతం బాలయ్య లేపాక్షి ఉత్సవాలకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటున్నాడు. అందుకోసం తనవంతుగా చేయాల్సిందంతా చేస్తున్నాడు. హిందూపురం నియోజకవర్గంలోని కొడికొండ జాతీయ రహదారి నుంచి లేపాక్షి వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యేగా హీరో బాలకృష్ణ పాల్గొన్నారు. కొడికొండ వద్ద లేపాక్షి ఆర్చిని ఆవిష్కరించిన బాలకృష్ణ... జెండా వూపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో కలిసి బాలయ్య సైకిల్ తొక్కారు. 16 కిలోమీటర్లు సైకిల్ తొక్కి 40 నిమిషాల్లో లేపాక్షి చేరుకున్నాడు బాలయ్య. అంతే కాదు.. సైకిల్ కూడా వెరైటీగా తొక్కాడు. రెండు చేతులు వదిలిపెట్టి, అభిమానులకి అభివాదాలు చేస్తూ యువతలో ఉత్సాహాన్ని పెంచాడు. తెరపైనే కాదు.. బయట కూడా నేను హీరోనే అన్నట్టుగా సైకిల్‌పై బాలయ్య చేసిన విన్యాసాలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.