సాధారణంగా అందరూ హీరోలు ఫ్లాప్ డైరెక్టర్లతో చేయాలంటే వెనకడుగు వేస్తారు. కానీ మెగాహీరోలు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రానికి దర్శకుడు వినాయక్‌ను ఎంచుకున్నాడు. ఆయన కిందటి చిత్రం 'అఖిల్' డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవన్ చేస్తున్న 'సర్దార్' చిత్రం దర్శకుడు బాబి కూడా హిట్ డైరెక్టర్ అయితే కాదు. రామ్‌చరణ్ విషయానికి వస్తే ఆయన చాలాకాలంగా ఫ్లాప్‌లో ఉన్న దర్శకులకే అవకాశం ఇస్తూ వస్తున్నాడు. సంపత్‌నంది, కృష్ణవంశీ.. వంటి ఫ్లాప్ డైరెక్టర్లకు ఆయన చాన్స్‌లు ఇచ్చాడు. తాజాగా 'కిక్2' చిత్రంతో డిజాస్టర్‌ను ఇచ్చిన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'తని ఒరువన్' రీమేక్‌ను చేస్తున్నాడు. ఇక ఇదే దారిలో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ కూడా నడుస్తున్నాడు. ఇప్పటికే 'ఓం3డి' వంటి ఫ్లాప్‌ను ఇచ్చిన సునీల్‌రెడ్డితో ఆయన 'తిక్క' చిత్రం చేయనున్నాడు. ఆయన ఇప్పటికే ఫ్లాప్ డైరెక్టర్స్ అయిన రవికుమార్‌చౌదరి, హరీష్‌శంకర్‌లతో చిత్రాలు చేశాడు. తాజాగా రచయిత, దర్శకుడు బివిఎస్ రవి అలియాస్ మచ్చ రవి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఆయన మొదటి చిత్రం 'వాంటెడ్' ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఇక వరుణ్‌తేజ్ విషయానికి వస్తే 'జ్యోతిలక్ష్మీ' వంటి ఫ్లాప్ తర్వాత పూరీజగన్నాథ్ దర్శకత్వంలో 'లోఫర్' చేశాడు. తాజాగా 'ఆగడు, బ్రూస్‌లీ' వంటి డిజాస్టర్స్ అందించిన శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి సిద్దం అవుతున్నాడు. ఇలా మెగాహీరోలందరూ టాలెంట్‌కే తప్ప గెలుపోటములను పెద్దగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి.