ఒకరి కోసం త్యాగం చేస్తే... ఆ త్యాగానికి వేరొక్కరు అనవసరంగా బలైపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అదే విషయంలో అల్లుఅర్జున్‌కు ఎదురుకాబోతోంది. కాగా మొదట బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బేనర్‌లో రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న 'సరైనోడు' చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేయాలని భావించారు. అదే రోజు బన్నీ బర్త్‌డే కావడం కూడా విశేషం. కానీ అనుకోకుండా అదే రోజు మావయ్య నటిస్తున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్' రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేయడంతో బన్నీ ఏప్రిల్ 22కు వెళ్లిపోయాడని సమాచారం. కానీ అదే రోజున తన 'అ..ఆ' చిత్రాన్ని డేట్ లాక్ చేసివున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌శ్రీనివాస్. దీంతో ముందు నుయ్యి-వెనుక గొయ్యి అనే పరిస్థితిలా తయారైంది బన్నీ పరిస్థితి. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీకి అత్యంత ముఖ్యుడు. మరి 'అ..ఆ' కోసం బన్నీ 'సరైనోడు' వెనక్కి వెళ్తుందా? లేక విధిలేని పరిస్థితుల్లో త్రివిక్రమే తన సినిమా డేట్‌ను మార్చుకుంటాడా? అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. మొత్తానికి పవన్ కోసం నితిన్‌ను బన్నీ బుక్ చేసినట్లే కనిపిస్తున్నాడు. కాగా 'సరైనోడు' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ భారీ అమౌంట్‌ని ఆఫర్ చేసి చేజిక్కించుకుంది. మార్చి రెండో వారంలో ఈ చిత్రం ఆడియో వేడుకను ఘనంగా ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత అల్లుఅరవింద్.