స్టార్‌హీరోల వల్ల ఓపెనింగ్స్ అయితే వస్తాయి. కానీ కథే కింగ్ అనేది ఎప్పుడూ నిరూపితం అవుతూనే వస్తోంది. సినిమాలో స్టార్స్ కంటే కంటెంట్ ఉంటేనే వాటికి లాంగ్ రన్ ఉంటుందనే విషయాన్ని ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లలోని రెండు చిత్రాలు మరోసారి నిరూపిస్తున్నాయి. తెలుగులో విడుదలైన 'క్షణం' చిత్రం అతితక్కువ పెట్టుబడితో నిర్మించబడింది. కానీ ఈ చిత్రం బడ్జెట్ కంటే రెండు మూడు రెట్లు అధికలాభాలను ఆర్జిస్తోంది. కాగా ఇటీవల బాలీవుడ్‌లో 'నీర్జా' చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. ఈ చిత్రం అత్యద్భుత వసూళ్లను సాధిస్తూ, విమర్శకుల ప్రశంసలే కాకుండా సాధారణ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అయినా కూడా స్టార్‌హీరోల చిత్రాల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రం 100కోట్ల మార్క్ దిశగా ప్రయాణం సాగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే 80కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం బడ్జెట్ కేవలం 25కోట్లు మాత్రమే కావడం విశేషం. ఇలా మంచి కంటెంట్‌తో సినిమాలు తీసి, అందుకు తగ్గట్లుగా పబ్లిసిటీ చేసి ప్రేక్షకులకు చేరువ చేయగలిగితే చిన్న చిత్రాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనే దానికి ఈ రెండు చిత్రాలే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.