కలెక్షన్స్‌తో మిగతా హీరోలందరూ టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టే పనిలో ఉంటే.. నారా రోహిత్ మాత్రం తన వరస సినిమాలతో రికార్డులు బద్దలు కొట్టేపనిలో ఉన్నాడు. ఇప్పుడు నారా రోహిత్ సినిమాల లిస్ట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. అతని స్పీడ్ మరే హీరో అందుకునే స్థితిలో లేరు. అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ 1972లో ఒకే సంవత్సరంలో తను నటించిన 18 చిత్రాలను రిలీజ్ చేసి రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 1983లో 14 సినిమాలను ఒకే సంవత్సరంలో రిలీజ్ చేసి కృష్ణ రికార్డుకు దాదాపు చేరువగా వచ్చాడు. తదుపరి కాలంలో ఎవరూ అలాంటి సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్‌లో నారా రోహిత్ ఈ రికార్డుకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. 2016లో నారారోహిత్ నటించిన 9 చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. రెండు వారాల కిందట కుమార్‌నాగేంద్ర దర్శకత్వంలో రోహిత్ నటించిన 'తుంటరి' చిత్రం విడుదలైంది. పవన్ సాధినేనని దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన 'సావిత్రి' త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని మార్చి25న విడుదల చేయాలని భావిస్తున్నారు. 'శంకర' చిత్రం కూడా షూటింగ్ పూర్తిచేసుకొని చాలాకాలం అయింది. రోహిత్‌కు జోడీగా రెజీనా నటించిన ఈచిత్రం కూడా ఓ తమిళ చిత్రానికి రీమేక్‌కావడం విశేషం. దీనికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ ప్రసాద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఆయన 'పండుగలా వచ్చాడు' అనే చిత్రం చేస్తున్నాడు. ఇక 'అప్పట్లో ఒకడుండేవాడు', 'రాజాచేయివేస్తే', 'వీరుడు', 'కథలో రాజకుమారి', 'జో అచ్యుతానంద' వంటి చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. వీటిల్లో 'రాజా చేయివేస్తే' , 'జో అచ్యుతానంద' చిత్రాలను ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. ఇలా ఈ ఏడాదిలో ఈ చిత్రాలన్నీ విడుదల చేయాలనే ఉద్దేశ్యంలో నారా రోహిత్ ఉన్నాడని సమాచారం.