చిరు 150వ సినిమాకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నెలలో కానీ లేదంటే వచ్చే నెల మొదటివారంలో కానీ సినిమాని మొదలుపెట్టబోతున్నారు. చిరు రెండో కూతురు శ్రీజ పెళ్లి పనులవల్ల సినిమా కాస్త ఆలస్యమైంది కానీ... లేదంటే చరణ్ పుట్టినరోజునాడే మొదలయ్యేది. ఇప్పుడు అన్ని పనులు పూర్తయ్యాయి కాబట్టి చిరు తన సినిమాపైనే దృష్టిపెట్టబోతున్నాడు. చరణ్ కూడా కొన్నాళ్లపాటు తన సినిమా వ్యవహారాల్ని పక్కనపెట్టి తన తండ్రి సినిమాని పట్టాలెక్కించాలని డిసైడైనట్టు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో అభిమానులతో సమావేశమైన చిరంజీవి తన 150వ సినిమాకి సంబంధించిన వివరాల్ని వాళ్లతో పంచుకున్నాడట. కథ ఎలా ఉంటుంది? ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నారో అన్నీ చెప్పేశాడట. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కత్తికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఆ సినిమాకి తెలుగులో కత్తిలాంటోడు అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు చిరు ఈ సందర్భంగా స్పష్టం చేసినట్టు సమాచారం. ఆ టైటిల్ మీకు తగ్గట్టే ఉందని, ఇదే ఫిక్స్ చేయాలని అభిమానులు చెప్పారట. వినాయక్ కూడా ఇదే టైటిల్‌కి ఓకే చెప్పినట్టు తెలిసింది. అంతా ఒక నిర్ణయానికొస్తే మాత్రం సినిమాని మొదలుపెట్టే రోజునే టైటిల్‌ని ప్రకటించే అవకాశాలున్నాయి.