మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ చిత్రం ఈ నెలాఖరులో గానీ లేదా మే మొదటివారంలోగానీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. వినాయక్ దర్శకత్వంలో తమిళ 'కత్తి'కి రీమేక్‌గా చేయనున్న ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు మెగాస్టార్ తన అభిమానులకు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా చిరు అభిమానులు మాత్రం ఈ టైటిల్ బాగాలేదని, ఇది మరీ కుర్రతనంగా ఉందని, ఇలాంటి టైటిల్ 'సరైనోడు', 'కత్తిలాంటోడు' వంటి టైటిల్స్ కుర్రహీరోలైన రామ్‌చరణ్, బన్నీ, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లాంటివారికి సూట్ అవుతుంది కానీ మెగాస్టార్ చిరంజీవికి సూట్ కాదని ఆయన అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి ముందే ఊహించిన చిరు కావాలని ఫ్యాన్స్ ఫీడ్ బ్యాక్ కోసమే అభిమానుల వద్ద ఈ టైటిల్‌ను ప్రస్తావించడని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం 'కత్తిలాంటోడు' కన్నా 'కత్తి' టైటిలే బాగుంటుందంటున్నారు. అయితే 'కత్తి' టైటిల్‌ను ఆల్‌రెడీ ఎవరో రిజిష్టర్ చేశారని, ఇక ఇటీవల 'కత్తి' పేరుతో నందమూరి కళ్యాణ్‌రామ్ ఇదే టైటిల్‌తో సినిమా చేస్తే అది డిజాస్టర్ అయిందని, సెంటిమెంట్‌పరంగా కూడా ఈ టైటిల్‌ను పెట్టడానికి చిరు సిద్దంగా లేడని తెలుస్తోంది. మరి 'కత్తిలాంటోడు' టైటిల్‌ను మార్చివేసి కొత్తగా మెగాస్టార్ వయసుకు,ఇమేజ్‌కు తగ్గ టైటిల్‌ను పెట్టాలని మెగాభిమానులు కోరుతున్నారు.