ఎ.యం.రత్నం.. ఈయనకు టాలీవుడ్, కోలీవుడ్‌లో ఉన్న క్రేజే వేరు. ఇప్పుడు అందరూ దిల్‌రాజును పొగుడుతుంటారు కానీ ఒక నిర్మాత పేరు చూసి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం అనే విషయంలో రత్నం తర్వాతే ఎవరైనా. కానీ కొన్ని అనుకోని డిజాస్టర్స్, తన కొడుకులను హీరోగా, దర్శకునిగా చిత్రాలు చేయాలనే నిర్ణయం ఆయన కొంపముంచింది. దాంతో పాటు ఆయన తీసిన కొన్ని చిత్రాలు కాస్ట్‌ఫెయిల్యూర్స్, మిస్ కాస్టింగ్‌ల వల్ల ఆయన కెరీర్ మసకబారిపోయింది. మరలా కోలీవుడ్‌లో స్టార్ హీరో అజిత్ సహకారంతో రత్నం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ తరుణంలో రత్నం తన కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో 'ఆక్సిజన్' అనే చిత్రం చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ భార్య ఐశ్వర్య నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఎ.యం.రత్నం ఈచిత్రాన్ని సమర్పిస్తున్నాడు. యాక్షన్ ధ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో శ్రీసాయిరాం క్రియేషన్స్ బేనర్‌పై రూపొందుతోంది. కాగా ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశిఖన్నా, అను ఇమానుయేల్‌లు హీరోయిన్లుగా, జగపతిబాబు ఓ కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రం బడ్జెట్ 30కోట్లు అని విశ్వసనీయ సమాచారం. అవసరమైతే మరింత బడ్జెట్ పెట్టడానికి కూడా రత్నం సిద్దంగా ఉన్నాడట.
కథను నమ్మి అంత బడ్జెట్ పెట్టడంలో తప్పులేదు కానీ గోపీచంద్ మార్కెట్‌ను దృషిలో పెట్టుకోకుండా ఇంత భారీ బడ్జెట్‌ను పెట్టడంపై ట్రేడ్‌వర్గాలతోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గోపీచంద్ కెరీలో బిగెస్ట్ హిట్ 'లౌక్యం', ఈ చిత్రం 22కోట్లు వసూలు చేసింది. వాస్తవానికి 20కోట్ల మార్కెట్ ఉన్న హీరోపై 15 లేదా కథపై అంతగా నమ్మకం ఉంటే 20కోట్ల దాకా పెట్టడమే అసలు వ్యాపార రహస్యం. కానీ మరోసారి రత్నం తన కొడుకు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టడం శ్రేయస్కరం కాదని తెలిసిపోతోంది. ఈ విషయంలో మంచి ఉదాహరణలు గోపీచంద్ చిత్రాలే అని చెప్పవచ్చు. ఆయన చేసిన 'సాహసం, జిల్' చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ కేవలం ఓవర్‌బడ్జెట్ వల్ల నిర్మాతలు నష్టపోవాల్సి వచ్చింది. కాగా ఈచిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే రత్నం మరోసారి తాను చేసిన పాత తప్పులనే రిపీట్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది.