స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. పెద్ద నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు తన కోసం పడిగాపులు కాసిన వారు ఇప్పుడు దూరంగా తప్పుకుంటున్నారు. ఈ స్థితిలో ఉంటే ఏ దర్శకుడైనా కిందామీదా పడతాడు. కానీ ఆ స్ధానంలో ఉన్నది పూరీజగన్నాధ్ కావడంంతో ఆయన వీటన్నింటినీ పట్టించుకోకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో చిత్రాలు చేయడానికి సిద్దం అవుతున్నాడు. పడిలేవటం అనేది ఎప్పటినుండో పూరీకి బాగా అలవాటే. పడిపోయాడనుకున్న ప్రతిసారి ఆయన మరలా బౌన్స్‌బ్యాక్ అయ్యాడు. తాజాగా పూరీ ఇషాన్ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ కన్నడ, తెలుగు భాషల్లో 'రోగ్' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన నందమూరి కళ్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని కళ్యాణ్‌రామ్ స్వయంగా తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవ్వగానే బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ సంజయ్‌దత్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. అదే సమయంలో ఆయన నారా రోహిత్‌తో కూడా ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. ఇటీవలే ఆయన ఎన్టీఆర్‌కు సైతం ఓ కథ వినిపించాడట. ఇలా ఎవరు ఏమనుకున్నా 'లోఫర్, జ్యోతిలక్ష్మీ' వంటి డిజాస్టర్స్ తర్వాత కూడా పూరీ డల్ అయిపోకుండా తనదైన శైలితో ముందుకు సాగిపోతున్నాడు. మొత్తానికి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకొని ఇప్పుడు తనని కాదన్నవారితోనే మరలా క్యూలో నిలబడేలా చేయాలనే గట్టి సంకల్పంతో పూరీ ఉన్నాడు.