క్రియేటర్ కు అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. కథని కథగా తీసేందుకు ఎన్నో ఆటంకాలు. సినిమా కథలకు నేపథ్యం సమాజంలోని వ్యక్తులు. సంఘటనలు. వాటికి తెరరూపం ఇచ్చే క్రమంలో పలువురు అడ్డు పడుతున్నారు. తాజాగా తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం సినీరంగానికి హెచ్చరిక లాంటిది చేసింది. తమని అగౌరంగా చూపిస్తే సహించమని, వ్యంగ్యంగా పేర్లు పెట్టుకూడదని వార్నింగ్ తో కూడిన సూచన చేశారు. అవసరమైతే న్యాయపరంగా ఎదుర్కుంటామని అన్నారు.
లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించే పోలీసులంటే అందరికీ గౌరవమే. అయితే వారికి కూడా మామూలు వ్యక్తుల కుండే బలహీనతలు ఉంటాయి. అవినీతికి పాల్పడిన అనేక మంది అధికారులను సదరు పోలీసులే పట్టుకున్న సందర్భాలున్నాయి. కొందరిని రిమాండ్ కు సైతం తరలించారు. సివిల్ తగాదల్లో వేలు పెట్టకూడదని పై అధికారులు పలు మార్లు పోలీసులను హెచ్చరించారు. వ్యభిచారం చేస్తూ దొరికినవారు. ఆదాయానికి మించి సంపాదించినవారు. గృహహింసలో దొరికివారున్నారు. ఇలాంటి కొందరి క్యారక్టర్లు అప్పుడప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు. దీనిర్థం మెుత్తం పోలీస్ వ్యవస్థను తప్పుపట్టినట్టుకాదు. ఈ విషయాన్ని సదరు పోలీస్ అధికారులు గమనిస్తే మంచిది.
గతంలో పోలిసోడి పెళ్ళాం, రౌడి పోలీస్ అనే టైటిల్స్ పెట్టినప్పుడు, ఇప్పుడు పోలీసోడు అని పెట్టినప్పుడు అభ్యంతరాలు వచ్చాయి. సదరు నిర్మాతలు స్పందించి టైటిల్స్ మార్చారు. పోలీసులను హీరోలుగా చూపిస్తూ తీసిన సినిమాలు వచ్చినపుడు సదరు పోలీస్ సంఘం స్పందించి, ప్రశంసించి ఉంటే బావుండేది.
ఇటీవల సినిమాకు వివిధ వర్గాల నుండి అభ్యంతరాలు వస్తున్నాయి. కులాలు, మతాల గురించి ప్రస్తావిస్తున్నారని, నృత్యాల గురించి అని, వికలాంగుల గురించి అని,తమ ఊరి పేరు వాాడారని ఇలా అనేక ఆటంకాలు సినిమాకు వస్తున్నాయి. క్రియేటివ్ రంగమైన సినిమాకు పాత్రలు, సన్నివేశాలు సమాజం నుండే పుట్టుకువస్తాయి. మంచి, చెడు నిర్ణయించాల్సింది సెన్సార్ బోర్డు. ఒకసారి సెన్సార్ అనుమతి వస్తే ఆ సినిమా ప్రేక్షకులు చూడడానికి అభ్యంతరం లేదన్నమాటే.
ఏడాదికి దేశం మెుత్తంలో అన్ని భాషల్లో కలిపి సుమారు 800 సినిమాలు వస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని దర్శకులు వాపోతున్నారు. కళని కట్టడి చేసే సంకెళ్ళు సరికాదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.