ప్రస్తుతం టాలీవుడ్‌లో మే6 వతేదీపై అందరి కన్ను పడింది. ఆ ఒక్కరోజున మూడు చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఒకేసారి మూడు చిత్రాలు వస్తే ముగ్గురికి నష్టమే అని అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ డేట్ వల్ల ఇబ్బంది పడుతున్నది మాత్రం యువహీరో నితినే అనేది స్పష్టం. మే 6వ తేదీన నితిన్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న అ..ఆ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. కానీ అదే రోజున సూర్య-విక్రమ్ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 24 చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ విడుదల హక్కులు నితిన్ చేతిలోనే అంటే ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి చేతిలోనే ఉన్నాయి. ద్విభాషాచిత్రం కాబట్టి ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయడం అంత సులువు కాదు. ఇప్పటికే దర్శకనిర్మాతలు మే6వ తేదీన 24 విడుదల అవుతుందని ఖరారు చేశారు. కాబట్టి ఒకే రోజున అ..ఆ, 24 చిత్రాలు పోటాపోటీగా విడుదలయ్యే అవకాశాలు తక్కువే. కాబట్టి తన దర్శకనిర్మాతలను ఎలాగోలా ఒప్పించి అ..ఆ ను పోస్ట్‌పోన్ చేయకతప్పని స్థితిలో నితిన్ ఉన్నాడు. ఇక అదే రోజున దిల్‌రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న సుప్రీమ్ చిత్రం కూడా విడుదలకు సిద్దమైపోతోంది. సుప్రీమ్, 24 ల రాక ఖాయం కావడంతో ఇప్పుడు అటు ఇటు కాని పరిస్థితుల్లో అ..ఆ చిత్రం ఉంది. మరి ఈ రోజున ఎవరు వెనకడుగు వేస్తారు? ఎవరు అనుకున్న తేదీకి వస్తారు? ఎవరు త్యాగం చేస్తారు? అనేది చూడాల్సివుంది...!