లాభాల కోసం, ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అడల్డ్ కామెడీ చిత్రాలు బాలీవుడ్ లో విచ్చలవిడిగా తయారవుతున్నాయి. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం కోసం అంతగా దిగజారాలా? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. కాగా ఈ టైప్ ద్వంద్వార్ధాలు, కుళ్లు జోకులు, అడల్ట్ కంటెంట్ చిత్రాలు తెలుగులో కూడా మొదలయ్యాయి. వీటికి మన వారు ముద్దుగా బోల్డ్ కంటెంట్ అనే పదాన్ని వాడుతున్నారు. ఫ్యామిలీలతో కలిసి చూడలేని బూతు ఎక్కువవుతోంది. వాస్తవానికి బోల్డ్ చిత్రాలకు, బూతు చిత్రాలకు మధ్య సన్నని ఓ పలుచనైన తెర ఉంది. దాన్ని ఇప్పుడు మనవారు చెరిపేస్తున్నారు. దర్శకుడు మారుతి తన కెరీర్ ప్రారంభంలో చేసిన 'ఈరోజుల్లో, బస్టాప్' వంటి చిత్రాలు ఇదే తరహాలో రూపొందాయి. ఇక మంచు మనోజ్ నటించిన 'పోటుగాడు' చిత్రంలో కూడా ఇలాంటి అడల్ట్ జోకులు, సీన్లు ఉన్నాయి. ఇటీవల వచ్చి మంచి విజయం సాధించిన 'కుమారి 21ఎఫ్'లో కూడా అదే తంతు నడిచింది. తాజాగా మంచుమనోజ్ అన్న మంచు విష్ణు, రాజ్‌తరుణ్ లు హీరోలుగా నటించిన 'ఈడో రకం... ఆడో రకం' చిత్రంలో కూడా కావాల్సినంత అడల్ట్ కామెడీ ఉంది. వీటి ఉద్దేశ్యం ప్రేక్షకులను నవ్వించడమే అయినా నవ్వించడం కోసం ఇంతగా దిగజారాలా? అనే సందేహం విమర్శకులకు కూడా కలుగుతోంది. ఇలాంటి చిత్రాలను కనుక ప్రేక్షకులు ఆదరిస్తే ఇదే జోరు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా ఇలాంటి చిత్రాలు కూడా వెల్లువలా వస్తే ఈ ట్రెండ్ కూడా ఒక్కోసారి బోరు కొట్టి నిర్మాతలను నిలువునా ముంచే అవకాశాలు ఉన్నాయని అర్దం అవుతోంది.