ఎన్నాళ్ళుగానో తెలుగు సినిమా చేయాలని కలలు కంటున్నా తమిళ దర్శకుడు లింగుసామి ఎట్టకేలకు ఆ కలను నెరవేర్చుకోబోతున్నాడు. తమిళంలో స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన లింగుసామికి కథాబలం, కథనాన్ని ఎలా రక్తి కట్టించాలో అన్న విషయాల మీద మంచి కమాండ్ ఉంది. అందుకే అతని చిత్రాలన్నీ స్క్రీన్ ప్లే ఆధారంగా రన్ అవుతూ ఉంటాయి. ఆ మధ్య మహేష్ బాబు, లింగుసామిల కాంబినేషన్ సెట్ అయిందన్న వార్తలు వినబడినా అటు తరువాత అంత విషయం లేదని తేలిపోయింది. లింగుసామి ఈసారి అల్లు అర్జున్ చేయి పట్టుకున్నాడు. రెండు నెలల క్రితమే ఈ విషయాన్ని మీడియా వారితో వెల్లడించినా బన్నీ అప్పటికి సరైనోడుతో బిజీగా ఉండడంతో మరిన్ని విషయాలు తెలియరాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, సరైనోడు రిలీజయిన రెండో రోజే అంటే నిన్న, లింగుసామి హైదరాబాద్ నగరంలో దిగిపోయాడు. బన్నీతో గీతా ఆర్ట్స్ ఆఫీసులో పర్సనలుగా చర్చలు జరిపి, తొందరలోనే ప్రాజెక్టుని సెట్స్ మీదకి తీసుకు వెళ్లేందుకు కావాల్సిన ప్రణాళిక, ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమయ్యే ఈ చిత్రంలో అత్యున్నత సాంకేతిక విలువలు, హై బడ్జెట్ వెచ్చించనున్నారు. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా, లింగుసామి సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది.