కమల్ ఈసారి ఎన్నికల్లో ఓటు వేయడట. సినిమా తారలంతా ఓటు వేయండహో అని స్పెషల్‌గా ప్రకటనల్లో కనిపించి మరీ ప్రజల్లో ఓటు హక్కు అవగాహన పెంచుతుంటే ఒక బాధ్యత గల పౌరునిగా, కొంతమందిని ప్రభావితం చేయగలిగిన పేరున్న సెలబ్రిటీగా కమల్ ఈ వ్యాఖ్యలు చేయడం ఒకింత ఆశ్చర్యకరమే అనిపించినా.. ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా కమలే చెప్పాడు. రాబోయే ఎన్నికల్లో తాను ఓటు వేయడం లేదని పాత్రికేయులకు స్వయంగా తెలిపాడు. శభాష్‌నాయుడు షూటింగ్ కోసం మే 14 నుంచి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో రెగ్యులర్ షూటింగ్ కోసం కమల్ అక్కడికి వెళ్లనున్నాడు. అయితే మే 16న తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మీరు ఓటు హక్కు వినియోగించుకోరా? అని విలేకరులు అడిగితే ఈసారి ఓటర్ల జాబితాలో తన పేరు లేదని, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని వెళ్లితే అప్పటికే వేరెవ్వరో ఓటు వేసేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈసారన్నా ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించగా ఓటరు పట్టికలో తన పేరు లేదని, ఎన్నికల కమీషనర్ తనకు మంచి మిత్రుడే అయినా ఏం లాభం? నా బతుకిలా అయింది అని కమల్ నిట్టూర్చాడు.