రెండు తెలుగు రాష్ట్రాలు కరువుతో బాధపడుతున్నాయి. తాగేందుకు మంచి నీరు దొరక్క ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దాహార్తి తీరక మరణించిన ఇద్దరు చిన్నారుల దీనస్థితి చూసి ప్రజలు అయ్యోపాపం అనుకుంటున్నారు. ఒకవైపు వలసలు, మరోవైపు బుక్కెడు నీటి కోసం ఎదురుచూపులు. ఇదీ తెలుగు రాష్ట్రాల పరిస్థితి. ఇలాంటి తరుణంలో సెలబ్రిటీలు వేడుకలకు దూరంగా ఉండాలి. వీలైతే సహాయం చేయడానికి ముందుకురావాలి. తెలుగువారికి కష్టం వచ్చినపుడు ఆదుకోవడానికి సినీ ప్రముఖులు ముందుంటారు. కష్టం అంటే కేవలం తుపాను వంటివే కాదు, కరువు కూడా కష్టమే. దాసరి లాంటి పెద్దమనిషి ఈ విషయంలో చొరవ తీసుకుని ప్రజలకు, ప్రభుత్వానికి తోడ్పాటు అందించే పనిచేస్తే అందరు హర్షిస్తారు. కానీ దర్శకరత్న దాసరి నారాయణరావుకు మాత్రం ఇలాంటి ఆలోచన లేదు. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా, ఒక సారి కేంద్రమంత్రిగా పనిచేసిన దాసరి బుధవారం తన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే హడావుడిగా మీడియాను పిలిచేసి ఇంటర్య్వూలు ఇచ్చేశారు. 'తనది సున్నిత మనస్తత్వమని, అందుకే రాజకీయాల్లో రాణించలేకపోయానని' చెప్పుకొచ్చారు. అలాంటి సున్నితుడికి ప్రజల బాధలు కనిపించకపోవడం విచిత్రం. పైగా కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన బొగ్గు కుంభకోణంలో ఆయన పేరు ప్రముఖంగా ఉంది. చార్జీషీట్ సైతం దాఖలు చేశారు. అంటే తెల్లబట్టలేసే దాసరిపై నల్లటి మచ్చ పడిందన్నమాట.
చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో ఉన్నారు. మంత్రులుగా పనిచేశారు. కానీ ఎవరిమీద కూడా ఇప్పటి వరకు కుంభకోణ ఆరోపణలు లేవు. కేవలం దాసరిపైనే ఉన్నాయి. ఇంతటి అపవాదు ముఠగట్టుకున్న తరుణంలో కూడా బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన భావిస్తుండడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలను దృష్టి మల్లించడానికే చేస్తున్నట్టు అనుమానించాల్సి వస్తోంది.