సినిమా, టీవీ అవార్డులను వివిధ కల్చరల్ అసోసియేషన్స్ ఇస్తుంటారు. కొన్నిఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ కూడా వీటిని పంచుతుంటాయి. తెలుగు సీరియల్స్ పై ఎన్నో విమర్శలున్నాయి. కుటుంబసంబంధాలను విచ్చిన్నం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అయినప్పటికీ సీరియల్స్ హవా తగ్గడం లేదు.
న్యూస్ ఛానల్ టీవీ 9 ఇప్పుడు ఠీవీ అవార్డులంటూ ఒక కార్యక్రమం చేయనుంది. వివిధ ఛానల్స్ లో వచ్చే సీరియల్స్ ను చూసి వీక్షకులు ఎంపికచేస్తే టీవీ 9 అవార్డులు ఇస్తుందట. ఈ పెద్దన్న పాత్రను టీవీ 9 ఎందుకు చేస్తోంది. ప్రతి సంఘటనను భూతద్దంలో చూసే టీవీ 9 కు అకస్మాత్తుగా సీరియల్స్ పై ప్రేమ పుట్టుకువచ్చింది. అట్టహాసంగా అవార్డులు ఇవ్వడం ఆ కార్యక్రమాన్ని తమ ఛానల్ లోనే ప్రసారం చేసుకోవడం టీవీ ఛానల్స్ కు లాభసాటి వ్యాపారంగా మారింది. జెమిని, మా, జీ తెలుగు ఛానల్స్ ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాయి. పైగా వీటికి అతిథులుగా సినీ సెలబ్రిటీలను పిలుస్తారు. స్పాన్సర్లను వెతికిపట్టుకుంటారు. అంటే టీవీ అవార్డులనేవి ఫక్తు కమర్షియల్ గా మారాయన్నమాట.
టీవీ 9 నిర్వహించే ఠీవి అవార్డులకు శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పోరేట్ కాలేజీలపై అనేక విమర్శలున్నాయి. ఫీజులు దండిగా వసూలు చేస్తారని, ర్యాంకులను మేనేజ్ చేస్తారనేది అందరికీ తెలిసిందే. కార్పోరేట్ కాలేజీలపై సామాన్యులు సైతం ఈసడించుకుంటున్నారు. వీటిలో చదువుతున్న విద్యార్థులు కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఈ సంఘటనలపై టీవీ 9 కూడా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. అలాంటి వివాదస్పద ఇనిస్టిట్యూట్ ను ఇప్పుడు స్పాన్సర్ గా తీసుకుని టీవీ అవార్డుల కార్యక్రమం చేస్తోందంటే టీవీ 9 నిజాయితీపై అనుమానాలు కలుగుతున్నాయి. దీని వెనుక వేరే ఉద్దేశం ఉందా అని మీడియా సర్కిల్స్ సంశయం వ్యక్తం చేస్తున్నాయి.
టీవీ 9కు ఇతర ఛానల్స్ ప్రసారం చేస్తున్న సీరియల్స్ పై ప్రేమ పుట్టుకురావడమే చాలా చిత్రంగా ఉంది. పెద్దన్న పాత్ర ఎందుకు పోషిస్తున్నట్టు. త్వరలో నిర్వహించ బోయే ఈ కార్యక్రమానికి గవర్నర్ ను, చిరంజీవిని , కేంద్ర మంత్రులను అతిథులుగా పిలుస్తారని తెలిసింది.