తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక నమస్తే తెలంగాణ దినపత్రికకు చాలా బాధకలిగించే విషయం గుర్తుకువచ్చింది. ఆన్ లైన్ వ్యాపారం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి వెయ్యి కోట్లు నష్టం వస్తోందని తెగబాధపడింది. దీనిపై గురువారం మొదటిపేజీలో ప్రత్యేక కథనం ప్రచురించింది. నమస్తే తెలంగాణలో ప్రచురించిన వార్త ప్రభుత్వం గమనించి, ఆన్ లైన్ వ్యాపారంపై పన్ను వసూలు ఆదేశాలు జారిచేస్తే తెలంగాణ ప్రజల నడ్డివిరగడం ఖాయం. ప్రభుత్వానికి ఆదాయం పోతోందనే బాధ పత్రికకు ఎందుకట.దీని వెనుక చాలా మతలబు ఉంది. చాలా మంది పారిశ్రామికవేత్తలు ఆన్ లైన్ వ్యాపారం పట్ల గుర్రుగా ఉన్నారు. దీనివల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని గతంలో ఒకసారి నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రజలకు ప్రయోజనం కలిగిస్తున్న ఆన్ లైన్ వ్యాపారంపై టాక్స్ విధించడానికి ప్రభుత్వాలు సంసిద్దంగా లేవు. ఈ విషయం తెలియంది కాదు. అయితే దీనిపై పలువురు వ్యాపారవేత్తలు తెలివిగా పావులు కదిపారు. విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి నేరుగా తీసుకెళ్ళాలంటే నమస్తే తెలంగాణ పత్రికను నమ్ముకుంటే సరి అనుకున్నారు. ప్రజలకు నష్టం కలిగినా వ్యాపారస్తులకు మేలు జరుగుతుందని భావించి లోపాయి కారి ఒప్పందం చేసుకుని ప్రత్యేక కథనాన్ని నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించిందని మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.
ఇక ఆలులేదు చూలు లేదు ప్రభుత్వానికి వెయ్యి కోట్ల నష్టం వస్తుందనేది పెద్ద జోక్. పన్నులు విధిస్తే అదనంగా వచ్చే ఆదాయం అంతేకానీ అది నష్టం కాదు. ఈ విషయం గమనించకుండా నమస్తే తెలంగాణ హడావుడిగా వార్తను వడ్డించి, ప్రచురించింది.
పారిశ్రామికవేత్తలపై ఆ పత్రికకు ఎందుకంత ప్రేమ. భవిష్యత్తులో ఆన్ లైన్ వ్యాపారానికి తెలంగాణ ప్రభుత్వం పన్నులు విధిస్తే అది కుంటుపడుతుంది. తద్వార పారిశ్రామిక వేత్తలు తమ వ్యాపారాన్ని పెంచుకుంటారు. దాంతో నమస్తే...కు ప్రకటనల రూపంలో ఆదాయం పెరుగుతుంది. ఇదన్న మాట ప్రత్యేక కథనం వెనుక ఉన్న ఉద్దేశం.