టాలీవుడ్‌లో ద్వితీయ విఘ్నానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మొదటి సినిమాతో సంచలన చిత్రాలను తెరకెక్కించిన ఎందరో దర్శకులు తమ రెండో చిత్రాల విషయానికి వచ్చే సరికి దెబ్బతింటూ వస్తున్నారు. అలా ద్వితీయవిఘ్నాన్ని దాటలేకపోయిన దర్శకుల్లో కరణాకరన్, తేజ, పూరీజగన్నాథ్, వినాయక్, దశరద్, సుకుమార్, సురేందర్‌రెడ్డి, క్రిష్, సంతోష్ శ్రీనివాస్, నందినిరెడ్డి, ప్రవీణ్ సత్తారు, సుధీర్‌వర్మ వంటి దర్శకులు చాలా మంది ఉన్నారు. ఇక ద్వితీయ విఘ్నాన్ని అధిగమించిన దర్శకుల్లో రాజమౌళి, శ్రీకాంత్ అడ్డాల, కొరటాల శివ, మేర్లపాక గాంధీ వంటి వారు మాత్రమే కనిపిస్తారు. కాగా తన మొదటి చిత్రం 'పటాస్'తో సంచలనం సృష్టించి ఫ్లాప్‌హీరో కళ్యాణ్‌రామ్‌కు పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి. అనిల్ రెండవ సినిమాగా దిల్‌రాజు నిర్మాణంలో సాయిధరమతేజ్ హీరోగా తెరకెక్కిన 'సుప్రీమ్' చిత్రం బాగానే ఆడుతోంది. ముఖ్యంగా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే ప్రేక్షకులకు పైసా వసూల్ చిత్రంగా నిలుస్తోంది. వాస్తవానికి ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో దర్శకుడు అనిల్‌రావిపూడికి మంచి పట్టు ఉందన్న విషయం అందరికీ 'పటాస్'తోనే అర్థమైంది. అదే అంశం 'సుప్రీమ్'తో మరలా నిరూపితం అయింది. సో.. మొత్తానికి అనిల్ రావిపూడి తన ద్వితీయ విఘ్నాన్ని అధిగమించాడనే చెప్పుకోవాలి.