ఈరోజుల్లో ఏ పార్టీకైనా మీడియా మద్దతు తప్పనిసరి, తాము చేపట్టే సంక్షేమపథకాలు ప్రజలకు చేరువ చేయాలన్నా, ఏమైనా ఆరోపణలు వస్తే వాటికి కౌంటర్‌గా వార్తలు ఇచ్చే మీడియాధిపతుల ప్రసన్నం తప్పనిసరి. కాగా రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఏపీ నుండి టిడిపికి వచ్చే రెండు, మూడు సీట్లలో తమకు అవకాశం కల్పించాలని మీడియా అధిపతులు అప్పుడే బాబు వద్ద క్యూకట్టారు. వీరిలో ఆంద్రజ్యోతిరాధాకృష్ణ, ఎన్టీవీ అధినేత నరేంద్రచౌదరి, టివి5కు చెందిన నాయుడు పోటీలో ఉన్నారు. వీరిలో ఎన్టీవీ నరేంద్రచౌదరికి బాబు అవకాశం ఇవ్వడం కల. ఇక ప్రధాన రేసులో ఉంది మాత్రం ఆంద్రజ్యోతి రాధాకృష్ణనే. పార్టీకి చెందిన సీనియర్లు కూడా బాబుకు అవకాశం ఉంటే రాధాకృష్ణకే ఆ అవకాశం ఇవ్వాలని సలహాలు ఇస్తున్నారట. రాధాకృష్ణతో పాటు మిగిలిన ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం వారు కావడం గమనార్హం.
ఆంద్రజ్యోతి పత్రిక, ఎబిఎన్ చానెల్ చంద్రబాబుకు అనుకూలంగా ఇప్పటినుంచే కాదు... ఎప్పటినుండో భజన చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ విషయంలో ఈనాడు కంటే ఆంద్రజ్యోతినే ముందు వరసలో ఉంది. తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాధాకృష్ణ తన పత్రిక, చానెల్ ద్వారా గళమెత్తుతున్నారు. చానెల్‌ను ప్రసారం కానివ్వకుండా కేసీఆర్ అడ్డుకున్నప్పటికీ రాధాకృష్ణ జంకలేదు. తన సత్తా చూపిస్తునే ఉన్నాడు. అలాంటి వ్యక్తికి రాజ్యసభ చాన్స్ ఇస్తే తమ పార్టీకి తన మీడియా ద్వారా మరింత కృషి చేస్తాడనే ఆలోచన టిడిపి వర్గాల్లో ఉంది. అదే సమయంలో తెలంగాణకు చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చాడనే పేరు కూడా వస్తుంది. కాబట్టి వీలుంటే ఓ సీటును ఖచ్చితంగా రాధాకృష్ణకే బాబు ఇస్తాడనే ప్రచారం జరుగుతోంది.