కేంద్రంలో మోదీ అధికారం చేపట్టి రెండేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు బిజెపి దేశవ్యాప్తంగా విజయయాత్రలు చేయాలని నిర్ణయించింది. ఆ యాత్రల్లో భాగంగా కేంద్రమంత్రులైన అరుణ్‌జైట్లీ, స్మృతిఇరానీ, ఉమాభారతి, అనంతకుమార్, పీయూష్‌ఘోయల్, ప్రకాష్ జవదేకర్, మనోహర్‌పారిర్కర్, ధర్మేంద్ర ప్రదాన్, రవిశంకర్ ప్రసాద్ తదితర మంత్రులు ఏపీలో పర్యటించి, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అయితే ఈ రెండేళ్లలో మోడీ సాధించిన విజయాలు ఏమిటి? వారి మేనిఫెస్టో ప్రకారం ఎన్నింటిని దిగ్విజయంగా నెరవేర్చారు? అనే విషయం ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. దాన్ని అలా ఉంచితే ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి హామీ ఇచ్చినట్లుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వీలు కాదని బిజెపి మంత్రులు తేల్చిచెప్పారు. రేపు కేంద్ర మంత్రులు ఏపీలో పర్యటిస్తే ఏపీ ప్రజల స్పందన ఎలా ఉంటుంది? అసలే సెంటిమెంట్‌గా మారిన ప్రత్యేకహోదా విషయంలో పీకల్లోతు కోపంలో ఉన్న ఏపీ ప్రజలకు బిజెపి మంత్రులు ఏమని చెబుతారు? అనేది ఆసక్తిని రేపుతోంది. మరి ఎన్డీయే మిత్రపక్షంగా చంద్రబాబు ఈ సభల్లో పాల్గొంటారా? లేదా? అనేది తేలాల్సివుంది. ఇక మరోవైపు ఏపీలో పర్యటించే కేంద్రమంత్రుల్లో ఏపీకి చెందిన వెంకయ్యనాయుడును మోడీ, అమిత్‌షాలు పక్కనపెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య ప్రత్యేకహోదాపై పోరాడి, ఇప్పుడు చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. అందువల్ల వెంకయ్య ఎఫెక్ట్ బిజెపిపై పడకూడదని, అది దృష్టిలో ఉంచుకొని ఈ విజయయాత్రలకు ఏపీలో పర్యటించే మంత్రుల్లో వెంకయ్యకు మోడీ, అమిత్‌షాలు చోటు కల్పించలేదనే ప్రచారం సాగుతోంది.