దర్శకుడు కరుణాకరన్ పేరు వినగానే గుర్తొచ్చేవి మంచి రొమాంటిక్ లవ్ స్టోరీస్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మర్చిపోలేని 'తొలి ప్రేమ' వంటి హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడు 'డార్లింగ్','ఉల్లాసంగా ఉత్సాహంగా' వంటి మంచి ప్రేమ కథలను సినిమాలుగా రూపొందించాడు. ప్రస్తుతం కరుణాకరన్ హీరో రామ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'ఎందుకంటే ప్రేమంట' అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది. అయినా.. ఈసారి కరుణాకరన్ చెప్పిన కథ నచ్చడంతో రామ్ ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో కరుణాకరన్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో ఉన్నాడు. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ స్టొరీ అని సమాచారం. రామ్ ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత రామ్, కరుణాకరన్ ల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.