బలం లేని చోట మిత్రపక్షాలతో కలిసి వెళ్లడం రాజకీయాల్లో సాధారణమే. అయితే ఏ పార్టీ కూడా ఎల్లకాలం మిత్రపక్షం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలని కోరుకోదు. తమకంటూ ఓ క్రేజ్‌ను జనాలలో తెచ్చుకున్న తర్వాత మిత్రపక్షాలకు బై చెప్పి ఒంటరిగా పోటీ చేసి గెలవాలనే కోరుకుంటుంది. అన్ని పార్టీల విధానం ఇదే అయినా ఇందులో బిజెపి నాలుగాకులు ఎక్కువే చదివింది. రెండు దశాబ్దాల పాటు బీహార్‌లో జెడియూతో చెలిమి చేసిన బిజెపి ప్రస్తుతం అక్కడి జెడియూ, ఆర్జేడీలకు పోటీగా ఎదిగి ఒంటరిగా పోటీ చేసి పీఠం దక్కించుకునే స్ధాయికి ఎదిగింది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే అక్కడ శివసేనకు మంచి పట్టు ఉంది. దీంతో మొదట్లో శివసేనతో పొత్తుపెట్టుకున్న బిజెపి ప్రస్తుతం తామే అధికారంలోకి వచ్చి శివసేనను తమకు మిత్రపక్షంగా మార్చేసింది. ఇక ఎక్కువగా అస్సాంలో ప్రాంతీయపార్టీలతో కలిసి మెలిగిన బిజెపి ఇప్పుడు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్ధాయికి వచ్చింది. అదే విధానాన్ని తెలంగాణ, ఏపీలలో కూడా అమలు చేయాలనే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉంది. దీని కోసం ఆ పార్టీ ఇప్పటికే వ్యూహరచనలు చేస్తోంది. మరో పదేళ్లలో ఈ రెండు రాష్ట్రాలలోనూ ఒంటరిగా అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. మరి బిజెపి కల ఫలిస్తుందా? లేదా? అనే విషయం తెలియాలంటే చాలాకాలం వెయిట్ చేయకతప్పదు.