రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో ఖాళీ కానున్న నాలుగు సీట్లకు గాను, వైసీపీకి ఒక సీటు పోగా మిగిలిన మూడుసీట్లలో ఒక స్దానాన్ని తమ మిత్రపక్షమైన బిజెపికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేశాడు. కానీ రోజులు గడుస్తున్నా ఓ సీటు తమకు కావాలని బిజెపి ఎంతకీ బాబును అడగటం లేదు. బిజెపికి ఒక రాజ్యసభ సీటు ఇచ్చి దానికి బదులుగా రెండు గవర్నర్ పోస్ట్‌లను, కొన్ని నామినేటెడ్ పదవులను కోరారని చంద్రబాబు ఆలోచన. కానీ ప్రత్యేకహోదా అంశంపై ఏపీ ప్రజలు బిజెపిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేది వాస్తవం. దాంతో చాలామంది ఏపీ నుండి బిజెపి వారికి అవకాశం ఇవ్వకూడదని, ముఖ్యంగా వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్‌లకు సీటు ఇస్తే అది తమను మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని టిడిపిని రాష్ట్రంలో ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న పలు సంఘాలు హెచ్చరించాయి. అయినా సరే బిజెపికి ఒక సీటు ఇవ్వాలని బాబు భావించాడు. తద్వారా తగిన లబ్దిని, ముఖ్యంగా కేంద్రంతో మరింత ధృఢమైన బంధాన్ని ఏర్పరచుకోవచ్చని ఆయన భావించారు. కానీ ఏపీలో ప్రజల వ్యతిరేకతను ముందుగానే గ్రహించిన బిజెపి అధిష్టానం వెంకయ్యనాయుడును రాజస్ధాన్ నుండి, నిర్మాలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి బరిలోకి దించింది. ఈ విషయంలో వెంకయ్యకు తీవ్ర అవమానం జరిగిందనే చెప్పాలి. ఇటు ఆంద్రా వాళ్లు కాదని చెప్పడం, మరోవైపు తమ రాష్ట్రం నుండి ప్రాతినిద్యం వహిస్తూ ఆంధ్రా తరపున మాట్లాడుతూ, తమ రాష్ట్రానికి ఏమీ చేయని వెంకయ్యను ఈసారి తమ రాష్ట్రం నుండి రాజ్యసభకు పంపడంపై కర్ణాటకలో తీవ్రవిమర్శలు మొదలయ్యాయి. దీంతో నాయుడు పరిస్థితి రెంటికి చెడిన రేవడి అయింది. ఇప్పుడు ఆయన ఏపీలోనే కాదు కర్ణాటకలో కూడా తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. దీంతో ఆయనకు రాజస్ధానే దిక్కయింది.