అధికారం ఎవరి చేతిలో ఉన్నా సరే.. అది కాంగ్రెస్ అయినా, టిడిపి అయినా వారు ప్రాధాన్యం ఇచ్చేవి మూడు కులాలకే. రెడ్డి, కమ్మ, కాపు...! దీంతో జనాభాలో సగభాగం ఉన్న బిసీలు, దళితులు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, వైశ్య తదితర కులాలలోని పేదలు కూరలో కరివేపాకులై పోతున్నారు. కాంగ్రెస్ లేదా వైసీపీ రాజ్యం వస్తే అందులో రెడ్డి సామాజిక వర్గం, టిడిపి అధికారంలోకి వస్తే కమ్మ, వీరిద్దరికి ఉమ్మడిగా కాపు ప్రయోజనాలు తప్ప మిగిలిన వారి గోడు వినిపించడం లేదు. తాజాగా టిడిపి కూడా అదే దారిలో నడుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు మాయావతి హాయంలో జరిగినట్లుగా కులాల పునరికీరణ జరిగితే తప్ప ఈ నాయకులకు మిగతావారు గుర్తు రారా? అనే విషయం అర్ధం కావడం లేదు. ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకు కోసం అందరినీ మభ్యపెట్టడం, గెలిచిన తర్వాత రిక్త హస్తం చూపించడం రాజకీయపార్టీలకు అలవాటైపోయింది. త్వరలో జరగనున్న రాజ్యసభ సీట్ల విషయంలో కూడా సుజనాచౌదరి పేరు ఖచ్చితంగా ఉంటుందని సమాచారం. ఆయనపై ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నా, కేంద్రంలో ఆయన్ను పట్టుబట్టి మంత్రిని చేసిన చంద్రబాబు మరోసారి ఆయనకు సీటు ఇవ్వడం ఖాయమైందంటున్నారు. మరో సీటును కాపులకు కానీ, మహిళకు కానీ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మాత్రం మిగిలిన కులాలన్ని కలసి ఏకతాటిపైకి వచ్చి తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు.