టాలీవుడ్‌లో సీనియర్ స్టార్స్, యంగ్‌స్టార్స్ అందరితో కలిసి నటించిన హీరోయిన్ శ్రియ. ఆమె ఇటీవల కాలంలో నాగార్జున సరసన 'మనం', వెంకటేష్ సరసన 'గోపాల గోపాల' చిత్రాల్లో నటించింది. ఇక విషయానికి వస్తే బాలయ్య వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం మొదటి షెడ్యూల్ మొరాకాలో జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగనుంది. ఇప్పటివరకు ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఖరారుకాలేదు. రాణి పాత్ర కావడంతో ఈ చిత్ర దర్శకుడు క్రిష్ ఇప్పటికే నయనతార, ఇలియానా, అనుష్క, కాజల్ వంటి పలు పేర్లను పరిశీలిస్తున్నాడు. తాజాగా ఈ జాబితాలో శ్రియ పేరు కూడా చేరిపోయింది. ఆమె కూడా ఈ చిత్రంలో నటించేందుకు సుముఖత తెలియజేసింది. మరి ప్రతిష్టాత్మకమైన ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ అవకాశం ఎవరికి దక్కుతుందో వేచిచూడాల్సివుంది...! గతంలో బాలకృష్ణ సరసన శ్రియ 'చెన్నకేశవరెడ్డి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.