సీబీఐ అంటే కేంద్రం కనుసన్నల్లో పనిచేస్తుందని, సీఐడి అంటే రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుందనే దురభిప్రాయం చాలా మందిలో ఉంది. వాస్తవానికి సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కింద, అలాగే సీఐడిని కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయి. తమ రాజకీయ మనుగడకు, తమ వ్యతిరేకులపై కక్ష్య సాధించేందుకు ఈ వ్యవస్ధలను కాంగ్రెస్ పార్టీ వాడుకొని భ్రష్టు పట్టించినట్లుగా మరే పార్టీ నాశనం చేయలేదు. కాంగ్రెస్ తానులోని ముక్కే అయిన జగన్‌కు ఈ పరిస్థితి అందరికంటే బాగా తెలుసు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందనే సామెతలాగా వైసీపీ నేత జగన్ కాపు ఐక్య గర్జన సందర్బంగా తునిలో జరిగిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్డం సంఘటన, ఇతర దుర్ఘటనలకు బాధ్యులను తేల్చేందుకు టిడిపి సిఐడి విచారణ జరిపిస్తామంటే కాదు...కాదు.. సిఐడి విచారణ అంటే బాబు కనుసన్నల్లో జరుగుతుందని, దమ్ముంటే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. అయితే ఈ ఘటన వెనుక వైసీపీ కార్యకర్తల ప్రమేయం, ముద్రగడ రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా కారణమని జగన్‌కు బాగానే తెలుసు. కానీ సిబిఐ విచారణ అంటే టిడిపి పార్టీ వెనకడుగు వేస్తుందని, ఆ రిపోర్ట్ తనను, ముద్రగడను కూడా తప్పుపట్టినా అది సిఐడి నిర్వాకమని తేలిగ్గా కొట్టి పారేయవచ్చనేది జగన్ వ్యూహం. కానీ అనుకోకుండా ఇక్కడే చంద్రబాబు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. జగన్ కోరుతున్నట్లు సిబీఐ విచారణకు సిద్దమని, దీనికి ముద్రగడ కూడా ఒప్పుకుంటే సిబిఐ చేత విచారణ జరిపించడానికి తాము సిద్దంగా ఉన్నట్లు ప్రకటించాడు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే జగన్, ముద్రగడలు తాము తీసిన గోతిలో తామే పడ్డ చందంగా అనిపిస్తోంది.