రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా మట్టికొట్టుకుపోయింది. పోనీ రాష్ట్రాన్ని విభజించినందుకు తెలంగాణలో అయినా బాగుపడిందా? అంటే అదీ లేదు. అక్కడ కూడా ఆ పార్టీ పరిస్దితి దయనీయంగానే ఉంది. ఏపీలో కాంగ్రెస్‌ను మరలా పునరుజ్జీవింపచేయడం కోసం ఏపీ పిసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లోనే ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన, అభిమానుల అండ విపరీతంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని మాత్రం ఏపీలో కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదు. మరి చిరంజీవినే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడో? లేక ఆ పార్టీ ముఖ్యనాయకులే ఆయనను దూరం పెడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌లోకి ప్రజాబలం ఉన్న పవన్‌కళ్యాణ్‌నుకానీ, లేదా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డిని కానీ అరువు తెచ్చుకోవాలని ఈమధ్య ఆ పార్టీ నాయకులు పాడిందే పాడుతున్నారు. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటినుండే పార్టీని, కార్యకర్తలను సన్నద్ధం చేసే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఈలోపు జరిగే కొన్ని స్ధానిక ఎన్నికలను ఇందుకు పునాదిగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. గ్రేటర్ విశాఖ ఎన్నికలతో పాటు కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన కొన్ని మున్సిపాలిటీల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకుండా వైయస్సార్‌సీపీతో పాటు వామపక్షాలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగి తమ పట్టు ఏపీలో ఎంత ఉందో తెలుసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరి కాంగ్రెస్‌ను మిత్రపక్షంగా పెట్టుకోవడానికి వైయస్సార్‌సీపీ, వామపక్షాలు వంటివి ముందుకు వస్తాయా? అన్నది మాత్రం అనుమానమే.