వేసవి సెలవులు చివరకు వచ్చేసరికి విడుదలవకుండా మిగిలిపోయిన చిన్నా చితకా సినిమాలు తమ భవితవ్యం తేల్చుకోవడానికి ఉబలాటపడుతున్నాయి. జూలై, ఆగస్టు ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి సందు దొరికితే దూరిపోదాం అన్న భావనలో చానా నిర్మాతలే ఉన్నారు. ఏదో తూతూ మంత్రంగా, మమః అనిపించుకోవడానికే రిలీజ్ చేస్తున్నారా లేక వాళ్ళ సినిమాల మీద నమ్మకంతోనా అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఈ శుక్రవారం మాత్రం ఓ ఆరు మూవీస్ మన ముందుకు దిగబోతున్నాయి. ఇందులో నాని జెంటిల్మెన్ ముఖ్య చిత్రం కాగా, మీకు మీరే మాకు మేమే, కంట్రోల్ సి, గుప్పెడంత ప్రేమ, ప్రేమికుడు మరియు రుద్ర వరసగా నిలబడ్డాయి. నిజానికి ఎన్ని సినిమాలకు ఎన్నెన్ని రిలీజ్ థియేటర్స్ దొరుకుతాయో తెలియదు. బట్... ల్యాబుల్లో మురుగబెట్టడం దేనికి... జనాల మీదకి వదిలేస్తే ఓ భారం తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ కొద్దిమంది నిర్మాతల్లో మాత్రం తప్పకుండా ఉండే ఉంటుంది. ఇలా ఆరేసినా, ఏడేసినా ఇరగ ఆడుతున్న అఆకి ఏమైనా తేడా పడుతుందా అన్నది తెలియాల్సి ఉంది.