తన కెరీర్‌లో శతాధిక చిత్రాలను పూర్తి చేసి అన్ని రకాల జోనర్ చిత్రాలలో సూపర్‌హిట్స్‌ను నమోదుచేసిన సంచలన దర్శకుడు కోడిరామకృష్ణ. అసలు టాలీవుడ్‌కి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌ను పరిచయం చేసింది ఈయనే అంటే అతిశయోక్తి కాదు. ఆయన తీసిన 'అమ్మోరు, దేవి, అరుంధతి' చిత్రాలు దీనికి ఉదాహరణలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఓ సంచలనానికి తెరతీస్తున్న సంగతి తెలిసిందే. విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా ఆయన కన్నడలో చేస్తున్న అతి పెద్ద సాహసం 'నాగరహవు'. కన్నడ సూపర్‌స్టార్ దివంగత విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో తెరపై ఆవిష్కరిస్తూ ఆయన అతి పెద్ద సంచలనానికి నాందిపలికాడు. ఈ చిత్రాన్ని 'నాగాభరణం' పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్ధ స్డూడియో గ్రీన్ తెలుగు హక్కులను భారీ రేటుకు సొంతం చేసుకుంది. నిర్మాత జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని తెలుగుప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతున్నాడు. 730రోజలు, 7దేశాలకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు కష్టపడి చనిపోయిన విష్ణువర్ధన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో మరలా సజీవుడిని చేస్తున్న ఈ ప్రయత్నం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం జులైలో విడుదలకు సిద్దమవుతోంది.