ఆరు పదుల వయస్సులో హీరోలు డాన్స్‌లు వేయడం కష్టమా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే తెలుగు సినిమాకు రెండు కళ్ళు అని చెప్పబడే ఎన్టీఆర్, అక్కినేని చాలా అవలీలగా తమ ఆరు పదుల వయస్సులో స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. అప్పట్లో లేటు వయసులో కుర్ర హీరోయిన్స్‌తో డాన్స్ లేమిటనే విమర్శలు కూడా వచ్చాయి.
హీరోలు డాన్స్‌లు చేయడం అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అక్కినేని చాలా సినిమాల్లో హుషారైన స్టెప్స్ వేసి అదరగొట్టారు. తన అరవై ఏళ్ళ వయస్సులో ఊరంత సంక్రాంతి, రాముడు కాదు కృష్ణుడు, శ్రీరంగనీతులు, అనుబంధం, జస్టిస్ చక్రవర్తి, భలే దంపతులు, దాగుడుమూతల దాంపత్యం వంటి చిత్రాల్లో పాటలకు స్టెప్స్ వేసి రొమాంటిక్ హీరో అనే పేరు సార్ధకం చేసుకున్నారు. అంతేకాదు తన 68వ ఏట కాలేజి బుల్లోడు అనే సినిమాలో డిస్కో శాంతితో కలిసి పోటీగా స్టెప్స్ వేశారు. అక్కినేనికి ఆరుపదుల వయస్సుదాటాక, ఆయన వారసుడిగా నాగార్జున అరంగేట్రం చేయడంతో కుర్రపాత్రలను వదిలేసి, పెద్ద తరహా పాత్రలకే పరిమితమయ్యారు. లేదంటే మరికొన్ని చిత్రాల్లో ఆయన డాన్స్ చూసే అవకాశం ఉండేది.
ఇక ఎన్టీఆర్ అరవై ఏళ్ళు నిండాక రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే అప్పటికే ఆయన అనేక చిత్రాల్లో తన స్టైల్లో స్టెప్స్ వేసి అభిమానులను ఉర్రూతలూగించారు. 1980 నుండి సరదారాముడు, ఛాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు, ఆటగాడు, సర్దార్ పాపారాయుడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, నా దేశం చిత్రాల్లో హుషారైన డాన్స్‌లు చేశారు. బరువైన శరీరం అయినప్పటికీ చాలా సులువుగా డాన్స్ చేశారని అభిమానులు ఆనందించేవారు.
నటనకు, డాన్స్‌లకు ఈ సీనియర్ హీరోలు ఇద్దరు మార్గం వేశారు. కాబట్టి ఈతరంలో అరవైలో స్టెప్స్ వేయడం అంటే అదొక గొప్పగా చెప్పుకోవడం సరికాదు.