యువహీరోల్లో మంచి జోరు మీదున్న హీరో నాని. 'భలే భలే మగాడివోయ్', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. హ్యాట్రిక్ సినిమాగా శుక్రవారం 'జంటిల్‌మన్' విడుదలవుతోంది. ఇది కూడా హిట్ అయితే వరుసగా మూడు హిట్ సినిమాల్లో నటించిన క్రెడిట్ నానికి దక్కుతుంది.
చిత్రాల ఎంపికలో వైవిథ్యం చూపుతున్న నాని కామెడీకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. తన నుండి హీరోయిజం కంటే కామన్‌మెన్ తరహా పాత్రలనే ప్రేక్షకులు ఆశిస్తున్నారని గ్రహించి, ఆ తరహా కథలనే ఎంపికచేసుకుంటున్నాడు. ఇక 'జంటిల్‌మన్' సినిమా రీమేక్ కథతో తీసింది. చిత్ర నిర్మాణ సంస్థకు అపార అనుభవం ఉంది. కానీ దర్శకుడి గురించి అందరికీ కొంత అనుమానం ఉంది. ఇంద్రగంటి మోహనకృష్ణ కమర్షియల్ సినిమాని ఎలా డీల్ చేయగలడా అని ఆసక్తిగా చూస్తున్నారు. పైగా నానితో ప్రయోగం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 'అష్టాచెమ్మ' ద్వారా తను పరిచయం చేసిన నాని ఇప్పుడు పెద్ద హీరో అయ్యి, ఇంద్రగంటికి కష్టకాలంలో డేట్స్ ఇచ్చాడు. దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఇద్దరికీ ఉపయోగమే.