తాను ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినప్పుడు కూడా కేవలం హైదరాబాద్‌నే అన్నింటిలో అభివృద్దిచేసి చివరకు విభజన సమయంలో ఏపీ ప్రజల పొట్టగొట్టిన చంద్రబాబు ప్రస్తుతం కూడా తన వైఖరి మార్చుకున్నట్లుగా కనిపించడం లేదు. అభివృద్ది, పరిశ్రమలు, ప్రాజెక్ట్‌లు, పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా అన్నింటినీ అమరావతికే పరిమితం చేస్తు మరోసారి తప్పు చేస్తున్నాడు. తమిళనాడులోని 'అమ్మ క్యాంటీన్ల' తరహాలో రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 'అన్న క్యాంటీన్ల'ను కూడా మొదట అమరావతిలోనే ప్రారంభిస్తున్నాడు. వాస్తవానికి ఈ పథకాన్ని మొదటగా బాగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాల్లో ఏర్పాటు చేస్తే నిజమైన లబ్దిదారులకు మేలు జరుగుతుంది. కానీ ఆ దిశగా చంద్రబాబు ఆలోచించడం లేదు. అలా కాకుండా కేవలం అమరావతికే అన్నింటిని కేటాయిస్తే మరోసారి చరిత్ర పునావృతం అయి, ఇతర వెనుకబడిన జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా అమరావతిలో 'అన్న క్యాంటీన్ల'ను ఏర్పాటు చేస్తున్నామని, అవి సక్సెస్ అయితే ఈ పథకాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తామని చంద్రబాబు చెబుతున్నమాటలతో ఇతర ప్రాంతాలలోని పేద ప్రజలు ఏకీభవించడం లేదు.