వైసీపీ నుండి వస్తున్న వలస ఎమ్మెల్యేలు, ఆల్‌రెడీ ఆ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్‌ల మధ్య గొడవలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం అని తెలుసుకున్న చంద్రబాబు నియోజకవర్గాల్లో ఏర్పడుతున్న అంతర్గత కుమ్ములాటలను సరిదిద్దే బాధ్యతలను తన తనయుడు లోకేష్‌కు అప్పగించాడని సమాచారం. తాజాగా కడపజిల్లా మైదుకూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోయిన సుధాకర్‌యాదవ్ పెత్తనం రోజురోజుకూ హద్దుమీరుతోందని ఆ పార్టీ నాయకులు, నేతలు, కార్యకర్తలు లోకేష్ దృష్టికి తీసుకొని వచ్చారు. ఎవ్వరినీ లెక్కచేయకుండా తన మాటే వేదవాక్కు అన్న ధోరణిలో సుధాకర్‌యాదవ్ వ్యవహరిస్తున్నాడని, చివరకు డీఎల్ రవీంద్రారెడ్డిని కూడా పార్టీలోకి రాకుండా ఆయన అడ్డుకుంటున్నట్లు చాలారోజులుగా అధిష్టానానికి ఫిర్యాదులు వస్తున్నాయి. నియోజకవర్గంలోని పదవులు, ఉద్యోగుల్లో 80శాతం మంది సుధాకర్‌యాదవ్ వర్గీయులే అని ఆ పార్టీ నాయకులు ఆధారాలతో సహా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. కాగా సుధాకర్‌యాదవ్ పనితీరు, వ్యవహారపద్దతి పట్ల కోపంతో ఉన్న పార్టీ నాయకుల మాటలు విన్న లోకేష్ అదంతా నిజమేనని నిర్ధారణ చేసుకొని ఆయన్ను పిలిచి గట్టిగా మందలించాడని తెలుస్తోంది. నియోజకవర్గంలోని పోస్ట్‌లన్నీ మీ కులం వారికే కావాలని పట్టుబడితే ఎలా? అని లోకేష్ మందలించాడట. మరోవైపు ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గంలో సుధాకర్‌యాదవ్ నిలబడితే 30శాతం కూడా ఆయన గెలిచే అవకాశం లేదని సర్వేల ద్వారా లోకేష్‌కు తెలిసింది. దీంతో ఆయన వైపు ప్రజాబలం కూడా లేకపోవడంతో లోకేష్ ఆయన్ను అందరిముందు వార్నింగ్ ఇచ్చి మండిపడ్డాడని సమాచారం. అది జరిగినప్పటినుండి సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నేతలకు దూరంగా మెలుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆయనకు ఎందుకంత ధీమా? తన మాటే నెగ్గుతుందనే అత్యుత్సాహం ఎలా వచ్చాయా? అనేదే మీ అనుమానం కదా..! ఆయన మరెవ్వరో కాదు.. స్వయాన ఆర్ధికమంత్రి యనమలరామకృష్ణుడుకు వియ్యంకుడు.