ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలలో సామాన్య ప్రజలకు ఎక్కువ వడ్డీ, భూములు ఇస్తామని ఆశపెట్టి వేలాది కోట్ల రూపాయలతో బిచాణా ఎత్తివేసిన అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. 40లక్షల మంది పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఎంతో బాధపడుతున్నారని, కానీ ప్రభుత్వాలు మాత్రం వారి గోడు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ నేత లక్ష్మీపార్వతి, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హన్మంతరావులు మద్దతు ప్రకటించారు. వాస్తవానికి అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య ఎంత ఉందంటే వచ్చే ఎన్నికల్లో 40లక్షల కుటుంబాల ఓట్లు ఎవరికి పడితే వారే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాలు మాత్రం అగ్రిగోల్డ్ యాజమాన్యం నుండి ముడుపులు తీసుకొని, అగ్రిగోల్డ్ ఆస్దులను దాని యజమానుల నుండి అధికారంలోని మంత్రులు, ఇతర నాయకులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ సంఘటనకు బాద్యులను కఠినంగా శిక్షించి వారికి ఇవ్వాల్సిన మొత్తాలను ఇప్పించడంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా విఫలమవుతున్నాయి. దీంతో ఎందరో బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం నుండి ఏపీ సీఎం చంద్రబాబు 200కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని ఆయన సైలెంట్ అయిపోయారని లక్ష్వీపార్వతి తీవ్ర ఆరోపణలు చేసింది. యూరో లాటరీ, కృషి బ్యాంకు కుంభకోణం, అగ్రిగోల్డ్ వంటి బోగస్ వ్యవహారాలన్నీ బాబు అధికారంలోకి వచ్చాక గతంలోనూ, ఇప్పుడు జరుగుతున్నాయి. అయినా బాబు మాత్రం ఈ వేలాది కోట్ల రూపాయల కుంభకోణంపై పెదవి విప్పడం లేదు. దాంతో ప్రజల్లో చంద్రబాబుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాలలో ఇలాగే డిపాజిట్లు సేకరించి బోర్డ్ తిప్పేసిన సిరిగోల్డ్ అధినేతలైతే తమకు స్వయంగా జగన్ అండ ఉందని బాధితులను బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఉదంతాలపై చంద్రబాబు స్పందిస్తే ఆయన్ను బాధితులు దేవుడిలా చూసుకుంటారని మాత్రం చెప్పవచ్చు.