మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్-సమంత జంటగా వచ్చిన 'అ..ఆ' చిత్రం 'మీనా' నవల ఆధారంగా తీశారనే విమర్శలు సినిమా విడుదలైన మొదటిరోజు నుండే వచ్చాయి. అయితే ఆ నవలా రచయిత్రితో తాను మాట్లాడానని త్రివిక్రమ్ చెప్పడంతో ఆ సమస్య ముగిసిపోయింది. అయితే ఈ సినిమా విడుదలైన రెండో రోజునే రెడ్డి కుల సంఘాలు ఇందులో తమ కులాన్ని కించపరిచే పేర్లు వాడారని ఆందోళన చేపట్టారు. ఈ చిత్రంలో షకలకశంకర్ ఓ దొంగ. పేరు ప్రతాప్‌రెడ్డి, అలాగే హైదరాబాద్‌లో మరో ఫ్రెండ్ ఉంటాడు. అతని పేరు బాల్‌రెడ్డి ఫ్రం బంజారా హిల్స్ అని చెబుతాడు. ఈ రెండు పేర్లు అంతటా చర్చకు దారితీశాయి. విడుదలైన రెండో రోజే ఈ పేర్లపై రెడ్డి కులసంఘాలు ఆందోళన చేసినా మేకర్స్ దానిని పట్టించుకోలేదు. దాంతో వారు తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిశారు. దాంతో ఈ పేర్లలో ఉన్న రెడ్డి అనే పదాన్ని మేకర్స్ మ్యూట్ చేశారు. అయినా నేడు ఎంత సూపర్‌హిట్ చిత్రాలైనా రెండు, మూడు వారాలకే థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని చూడాలనుకున్న వారందరూ చూసేశారు. ఇక సినిమా బిజినెస్ క్లోజ్ మూమెంట్‌లో ఉంది. మరి ఇంత లేటుగా ఆ పదాలను మ్యూట్ చేయడం వల్ల..మ్యూట్ చేయించాం అని తృప్తి తప్ప.. రెడ్డి కులసంఘాలకు వచ్చే లాభం ఏమీ లేదని అర్దం అవుతోంది.