వెండితెర నాయికలు వయసు మీదపడ్డాక టీవీ షోస్ లో పాల్గొనడానికి ముచ్చటపడుతున్నారు. కొందరేమో పెదరాయుడు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే జీ టీవీలో జీవిత, మా టీవీలో సుమలత కుటుంబ తగాదాలను పరిష్కరిస్తున్నారు. సమాజం పట్ల ఎలాంటి అవగాహన లేని వీరు, న్యాయసలహాదారులను, డాక్టర్లను పక్కన పెట్టుకుని తగాదాలు పరిష్కరిస్తున్నారు. మొగుడు పెళ్ళాల గొడవలు, అక్రమసంబంధాలపై పెదరాయుడి తరహాలో తీర్పు చెబుతున్నారు. చాలామంది కుటుంబాల పరువును బజారున పడేస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ఈతరహా తీర్పులు చెప్పడానికి ఫైర్ బ్రాండ్ రోజా సైతం రెడీ అవుతోంది. జెమినీ టీవీలో రచ్చబండ పేరుతో నిర్వహించే కార్యక్రమం ఇదే నెలలో ప్రారంభం కానుంది.
రోజా, సుమలత, జీవిత ఈ ముగ్గురి కెరీర్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కేవలం గ్లామర్ కోసం వీరితో కార్యక్రమాలు నిర్వహించడానికి ఛానల్స్ ఆసక్తి చూపిస్తున్నాయి. దీనివల్ల రేటింగ్ పెరుగుతుందనేది వారి నమ్మకం.
కొద్ది రోజులు జయసుధ కూడా ఇలాంటి ప్రయత్నం చేసి, మానేశారు.
ఎక్కువగా కుటుంబాలు న్యాయ స్థానాలకు చేరుతున్న కేసులపైనే ఛానల్స్ దృష్టిపెట్టాయి. కొందరైతే కార్యక్రమంలోనే జంటలకు పెళ్ళి చేస్తూ హడావుడి చేస్తున్నాయి.
నిజానికి కుటుంబ కలహాలను పరిష్కరించడానికి అనేక వేదికలున్నాయి. నలుగురి మధ్య సర్దుబాటు చేయాల్సిన ఛానల్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. పైగా అక్రమసంబంధాల విషయంలో మూడో పార్టీ పేరు, ఫోటోలు చూపిస్తూ కొత్త వివాదం తెచ్చిపెడుతున్నాయనే విమర్శలున్నాయి.
కార్యక్రమాలను నిర్వహిస్తున్న మాజీ నాయికలకే అనేక సమస్యలున్నాయని, వారు తీర్పులు చెప్పడం ఏమిటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.