వాస్తవానికి సౌత్‌ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదలచేస్తామని దర్శకుడు రంజిత్, నిర్మాత కలైపులి థాను ప్రకటించారు. కానీ ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మే నెలకు పోస్ట్‌పోన్ చేశారు. కానీ ఈ చిత్రం మేలో కూడా విడుదల కాలేదు. అదేమంటే పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. జూన్ 1న వస్తామన్నారు... అదీ క్యాన్సిల్ అయింది. జులై 1 అన్నారు. అదీ జరగలేదు. ఇప్పుడేమో జులై15న వస్తున్నామని ప్రకటించారు. ఇలా రిలీజ్ డేట్స్‌ను వాయిదాల మీద వాయిదాలు వేస్తుండేసరికి 'కబాలి' విడుదల తర్వాత తమ చిన్నచిత్రాలను విడుదల చేయాలని ఎంతగానో ఎదురుచూస్తున్న నిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్లను ప్రకటించడానికి భయపడుతూ 'కబాలి' ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రజనీలాంటి చిత్రాలే ఇంకా చిన్న చిత్రాలతో ఆటాడుకోవడం చాలా బాధాకరం. మరి ఈ చిత్రం జులై 15న అయినా వస్తుందా? లేదా? అనే అనుమానం ఇంకా అందరినీ పీడిస్తోంది. ఈ చిత్రం కోసం దాదాపు తమిళ, తెలుగు భాషల్లో కలిపి ఓ డజన్ చిన్నచిత్రాలు విడుదలకు ఎదురు చూస్తుండడం గమనార్హం. ఇక ఈ చిత్రం ఆడియోను తమిళంలో ఎలాంటి ఆర్బాటాలు లేకుండా విడుదల చేసిన నిర్మాతలు తెలుగు ఆడియోను మాత్రం ఈనెల 26న హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఆడియో వేడుకకు రజనీ హాజరయ్యే అవకాశంలేదని తెలుస్తోంది.