రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్‌లో కూడా సూపర్‌జోడీ అనిపించుకున్న సూర్య-జ్యోతికలు త్వరలో కలిసి నటించనున్నారు. పదేళ్ల క్రితం వారు 2006లో వచ్చిన 'జిల్లెందు ఒరుక్కాదల్' చిత్రంలో నటించారు. ఈ చిత్రం తెలుగులో 'నువ్వు...నేను...ప్రేమ' గా విడుదలైంది. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కాగా గతేడాదే జ్యోతిక మరలా రీఎంట్రీ ఇచ్చింది. '30 వయోదినిలే' చిత్రంలో నటించింది. ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బేనర్ అయిన '2డి ఎంటర్‌టైన్‌మెంట్స్' పతాకంపై నిర్మించాడు.ఈ చిత్రం కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోయినా జ్యోతిక నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తాజా చిత్రాన్ని కూడా సూర్యనే నిర్మించనున్నాడు. తన తొలి చిత్రం 'కుట్రం కడిదల్'తో జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బ్రహ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి సూర్య నటించిన తాజా చిత్రం '24'లో నిత్యామీనన్ పోషించిన పాత్రను జ్యోతిక చేత చేయించాలనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల ఆ ఆలోచన విరమించారు. సో.. పదేళ్ల తర్వాత మరోసారి ఈ సూపర్‌హిట్ జోడీ రీల్‌లైఫ్‌లో కలిసి నటిస్తుండటం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.