త్వరలో టిఆర్‌ఎస్ మంత్రులు బిజేపీలోకి రానున్నారని వారి పేర్లు త్వరలో వెల్లడిస్తానని భారతీయ జనతా పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణ అంతటా చర్చనీయాంశం అవుతోంది. విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తామని, ఆర్టీసీ బస్సులకు వాడే డీజిల్‌పై వ్యాట్‌ను ఎందుకు ఎత్తివేయరని ఆయన కేసీఆర్‌ను దుయ్యబట్టారు. ఈ విషయాన్ని పక్కనపెడితే అసలు అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ మంత్రులు బిజెపిలోకి రావడం ఏమిటని? అందరూ అనుకుంటున్నారు. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అధికార తెరాసలోకి వెళ్తుంటే ప్రభాకర్ మాత్రం రాష్ట్ర మంత్రులు బిజెపిలోకి వస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. పోనీ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చి అధికార టిఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంటే అలాంటి అవకాశం ఉంది అని భావించవచ్చు. అంతేకానీ ఏకచ్చత్రాధిపత్యంగా ఏలుతోన్న కేసీఆర్‌ను కాదని మంత్రులు తమ అధికారాన్ని వదులుకొని బిజెపిలో చేరడం అనే మాట ఏదో సంచలనం కోసం చేసిందే తప్ప అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇప్పటికే టిడిపిని, వైసీపీని, కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపట్టి అందరినీ తమ పార్టీలోకి చేర్చుకుంటూ ఉంటే ఇలాంటి హాస్యాస్పద కామెంట్లు చేయడం ఏమిటని... కనీసం రాజకీయ జ్ఞానం ఉన్న ఎవరైనా ఎలా వ్యాఖ్యానిస్తారు? అని బిజెపి శ్రేణులే ఈ ప్రకటన పట్ల ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా బిజెపిపై కూడా కేసీఆర్ ఫోకస్ పెడితే వారి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులే టిఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటివరకు బిజెపి నుండి పెద్దగా వలసలు లేకపోవడానికి కారణం కేవలం బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండటమేనని, ఇక్కడ కానీ పనులను కూడా ఢిల్లీ స్థాయిలో చేయించుకోగలమనే నమ్మకంతోనే బిజెపి నాయకులు ఇంకా అదే పార్టీలో ఉన్నారని, అదే లేకపోతే ఇటు తెలంగాణలో, అటు ఏపీలో కూడా బిజెపి నాయకులు పార్టీలు మారేవారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.