టాలీవుడ్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ జులై 9న విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఆయన ఈ సందర్భంగా లండన్‌లో పర్యటిస్తారు. యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) నిర్వహించే 'జయతే కూచిపూడి' ముగింపు వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. దీనితో పాటు అక్కడ పలువురు ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేయనున్న అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళారంగానికి ఎంతో సేవ చేస్తూ, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న యుక్తా 6వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం పవన్ యుకె, యూరప్‌లోని తన అభిమానులు నిర్వహించే ముఖాముఖిలో పాల్గొంటారు. గుంటుపల్లి జయకుమార్ ఆద్వర్యంలో పవన్ విదేశీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ అక్కడకు వెళ్తున్నది ఈ కార్యక్రమాల కోసమే అయినా అక్కడ ఆయన తన పొలిటికల్ ఎంట్రీతో పాటు అక్కడి తెలుగువారిని కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాడని అంటున్నారు. మొత్తానికి 2019లోపు పవన్ విదేశాలలోని తెలుగు వారందరినీ కలిసి మాట్లాడేలా తన పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.