జులై 8 నుండి రాష్ట్రంలో 'గడపగడపకు వైసీపీ' కార్యక్రమాన్ని జగన్ ప్లాన్ చేశారు. కానీ అదే సమయంలో ఆయన పార్టీలోని దాదాపు 21 మంది ఎమ్మెల్యేలు అమెరికా పర్యటనను ప్లాన్ చేసుకున్నారు. వచ్చేనెల అమెరికాలో జరిగే 'ఆటా' కార్యక్రమాలకు హాజరుకావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు అందాయి. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు అమెరికా వెళ్లి ఆటా కార్యక్రమాల్లో పాల్గొని పనిలో పనిగా అమెరికాను చుట్టి రావాలని, అందుకోసం జులై మొదటి వారం నుండి నెలరోజుల పాటు వారు టూర్‌కు సంబంధించిన కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నారు. కానీ కొందరు వైసీపీ అగ్రనాయకులు మాత్రం 'గడపగడపకు వైసీపీ' కార్యక్రమాన్ని పెట్టుకొని విదేశాలకు వెళ్లితే ఎలా? అని అంటున్నారు. దీంతో విదేశీ పర్యటనను ప్లాన్‌చేసుకున్న ఎమ్మెల్యేలు తాము రాజ్యసభ ఎన్నికల సమయంలోనే విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నామని, కానీ రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే ఇప్పుడు విదేశీ టూర్లు ఏమిటి? అని జగన్ మండిపడ్డాడని, ఇప్పుడు మాత్రం జగన్ హాయిగా తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం ఏమిటి? ఆయనకో రూల్? మాకో రూలా? అని మండిపడుతున్నారని సమాచారం.