నరసాపురం ఎంపీ, బిజెపి నాయకుడు గోకరాజు గంగరాజు అధికార టిడిపి చర్యలపై మండిపడుతున్నాడు. టిడిపి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం కోసం, కృష్ణ పుష్కరాల కోసం పురాతన ఆలయాలను కూల్చివేయడంపై ఆయన టిడిపిపై భగ్గుమంటున్నారు. మన సంస్కృతికి నిదర్శనమైన పురాతన ఆలయాలను కూల్చివేస్తున్న ప్రభుత్వం అదే స్ధలంలో ఉన్న పలు మసీదులు, చర్చిల జోలికి కూడా పోకుండా కేవలం హిందు దేవాలయాలనే లక్ష్యంగా చేసుకొని కూల్చివేయడం తగదని ఆయన టిడిపి ప్రభుత్వానికి సూచించారు. టిడిపి చేపడుతున్న పలు కార్యక్రమాలు గందరగోళంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. కాగా గోకరాజు గంగరాజు వ్యాఖ్యలతో టిడిపి ఇరుకున పడింది. ఈ విషయంలో తాను టిడిపి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని ఆయన గట్టిగా హెచ్చరించారు. గత కొంతకాలం ప్రత్యేక ప్యాకేజీతో పాటు రైల్వే జోన్, ఇతర నిధుల విషయంలో బిజెపి, టిడిపి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆలయాలను కూల్చుతున్న వారిని అడ్డుకునే వారి అంతు చూస్తామని టిడిపి నాయకులు బెదిరిస్తున్నారని, కానీ తాను వాటికి భయపడేది లేదని ఆయన తేల్చిచెబుతున్నారు. సో... ఇప్పుడు టిడిపికి బిజెపితో ఆలయాల కూల్చివేత అంశం వివాదాస్పదంగా మారింది.