తెలంగాణలో కాంగ్రెస్ పరిస్దితి రోజురోజుకు దిగజారుతోంది. ఈ విషయంలో తెలంగాణ సీనియర్ నేతలు వి.హన్మంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డిలతో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు, అధినేత్రి సోనియా మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ సమావేశంలో టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్, సీఎల్పీ నాయకుడు జానారెడ్డిలపై ఈ ముగ్గురు సీనియర్ల అభిప్రాయాలను సోనియా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు సీనియర్ నాయకులు టి.పిసిసి ఛీప్ ఉత్తమ్‌కుమార్‌పై సానుకూలంగానే స్పందించారని, కానీ సీఎల్పీనాయకుడు జానారెడ్డి పనితీరుపై ఈ ముగ్గురు అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే ఇప్పటికిప్పుడు జానారెడ్డిని మార్చినా ప్రయోజనం ఉండదని, కొంతకాలం వేచిచూసే ధోరణి అవలంభించాలని వారు సోనియాకు తెలిపినట్లు సమాచారం. తరచుగా జానారెడ్డి టిఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలు కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారని సమాచారం. మొత్తం మీద టిపిసిసి చీఫ్ విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉన్నప్పటికీ త్వరలో మంచి ముహూర్తం చూసి జానారెడ్డిని సీఎల్పీ నేత స్ధానం నుంచి తీసివేసే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం.