సినిమాలో కథానాయకుడు, కథనాయిక తమను నమ్ముకున్నవారికి సహాయ పడతారు. కష్టాల్లో ఉంటే ఆదుకుంటారు. అండగా ఉంటారు. కానీ ఒక నాయకి తనను నమ్ముకున్న వారికే కష్టాలు తెచ్చిపెట్టింది. ఇది ఆసక్తి కలించే విషయం. త్రిష నటిస్తున్న సినిమా 'నాయకి'. ఎలాంటి అవంతరాలు లేకుంటే జులై 15న తెలుగు,తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. కెరీర్ లోనే తొలిసారి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేసే అవకాశం త్రిషకు 'నాయకి' ద్వారా వచ్చింది. హీరోయిన్లు నటిస్తున్న హారర్ సినిమాలు సక్సెస్ అవుతున్న నేపథ్యంలో వాటిని ఫాలో అవుతూ తీశారు. త్రిష టైటిల్ రోల్ అంటే బిజినెస్ బాగా జరగాలి. నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాలి. కానీ జరిగింది వేరు. ఇటు తెలుగు, అటు తమిళ్ లో 'నాయకి' నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారనే మాట వినిపిస్తోంది. 'నాయకి' నిర్మాణం ఆలస్యం కావడంతో బడ్జెట్ తడిసిమోపెడైంది. దాంతో ఖర్చుకు బిజినెస్ కు లంకె కుదరడం లేదట. దీనివల్ల రిలీజ్ క్లియరెన్స్ కష్టమని ట్రేడ్ సమాచారం. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ తేదీ వాయిదా వేశారు. తాజా రిలీజ్ కూడా వాయిదా పడే ప్రమాదం ఉందనే మాట వినిపిస్తోంది.
త్రిష స్టార్ హీరోయిన్ కదా, ఆమెతో సోలో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ తో బయటపడవచ్చని ఆశించి పెట్టుబడి పెట్టినవారు ఆందోళన చెందుతున్నారని సమాచాయం. 'నాయకి' కాస్త విలన్ అయిందని వారు వాపోతున్నారు.