జయంత్ సి. పరాన్జీ ఈ పేరు తెలుగు ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయారు. తెలుగు టాప్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబుల సినిమాలను డైరెక్ట్ చేసిన చరిత్ర ఆయనది. మెగా బ్రదర్స్ ను డైరెక్ట్ చేసిన ఘనత కూడా ఆయనకు ఉంది. అలాంటి జయంత్ ఐదేళ్ళుగా అజ్ఞాతం లో ఉన్నారు. ఉత్తరాదితో సత్సంబంధాలున్నప్పటికీ సినిమా అవకాశాలు రాలేదు. బాలకృష్ణతో 'అల్లరి పిడుగు' తీశాక దాదాపుగా పరిశ్రమ జయంత్ ను మర్చిపోయింది. సరిగ్గా అప్పుడే పవన్ కల్యాణ్ సినిమా 'తీన్ మార్' (2011) అవకాశం తలుపుతట్టింది. ఈ సినిమా సైతం ఆడకపోవడంతో జయంత్ ఇంటికే పరిమితమయ్యాడు.
అలాంటి జయంత్ కు ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు హీరోగా నటిస్తున్న 'కాళహాస్తి' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఒక కొత్త హీరో ఎంట్రీకి సహజంగానే ఫామ్ లో ఉన్న డైరెక్టర్ ను తీసుకుంటారు. కానీ ఫ్లాపుల్లో ఉన్న జయంత్ కు అవకాశం రావడం వెనుక చిరంజీవి హస్తముందంటున్నారు. మంత్రి గంటా చిరంజీవికి అత్యంత ఆప్తుడు. ప్రజారాజ్యం నుండి చిరుతో కలిసి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యాడు. గంటాకు మంత్రి పదవిని చిరు ఇప్పించాడు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెదేపా తీర్థం పుచ్చుకుని గెలిచి మంత్రి అయ్యాడు.
తన కొడుకు రవిని హీరో చేయాలని నాలుగేళ్ళుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దర్శకుడు ఎవరైతే బావుంటుందనే చర్చలో చిరు సూచన మేరకు జయంత్ పేరు తెరపైకి వచ్చిందట. పూరి పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఆయన ఇప్పటికే మరో కొత్త హీరోను పరిచయం చేసే బాధ్యత ఉండడంతో చేయలేనని చెప్పేశారు. ఈ క్రమంలో జయంత్ కు పిలుపువచ్చింది. పైగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, డి.సురేష్ బాబు సైతం జయంత్ కు ఓటేశారట. ఈ విధంగా మూలన కూర్చున్న జయంత్ కు ఐదేళ్ళ తర్వాత 'కట్...యాక్షన్...' చెప్పే ఛాన్స్ వచ్చింది.