దగ్గుబాటి కుటుంబం నుంచి ఇప్పటికే ఇద్దరు హీరోలొచ్చారు. అందులో వెంకటేష్ స్టార్ హీరోగా కొనసాగుతుండగా, రానా బాహుబలితో జాతీయ స్థాయి నటుడయ్యాడు. అటు బాలీవుడ్‌లోనూ, ఇటు సౌత్‌లోనూ సినిమాలు చేస్తూ మంచి బేస్ ఏర్పాటు చేసుకొన్నాడు రానా. ఇప్పుడు ఆయన తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అభిరామ్ తెరంగేట్రం చేయబోతున్నాడన్న వార్త ఎప్పట్నుంచో వినిపిస్తోంది. ఆయన్ని తెరపై చూసుకోవాలని తాత రామానాయుడు ఎంతో ముచ్చటపడ్డారు కూడా. స్వయంగా కొన్ని కథలు విని అభిరామ్‌ని పరిచయం చేయాలని ప్రయత్నించారు కానీ కుదర్లేదు. కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకి అభిరామ్ ఎంట్రీ ఖరారైంది. ప్రముఖ దర్శకుడు వంశీ చేతులమీదుగా అభిరామ్ తొలి సినిమా తెరకెక్కబోతోంది. వంశీ ఇదివరకు తీసిన లేడీస్ టైలర్‌కి సీక్వెల్‌గా ఫ్యాషన్ డిజైనర్ పేరుతో ఓ స్క్రిప్టు సిద్ధం చేశాడు. అందులో యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ నటించాల్సింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌ని దగ్గుబాటి అభిరామ్‌తో ఫిల్ చేసినట్టు తెలుస్తోంది. వంశీలాంటి క్లాస్ డైరెక్టర్ చేతులమీదుగా పరిచయమవుతున్నాడంటే అభిరామ్ అదృష్టమనే చెప్పాలి. ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ నిర్మించబోతున్నారు. ఇటీవలే ఆయన మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారికని పరిచయం చేస్తూ 'ఒక మనసు' తీశారు. ఇప్పుడు మరో ప్రముఖ కుటుంబానికి చెందిన వారసుడిని పట్టేశాడన్నమాట.