అక్ష పార్దసాని తెలుగులో బోలెడన్ని సినిమాలు చేసింది. కానీ అందులో చెప్పుకోదగ్గ సినిమా అంటే ఒకే ఒక్కటి. అదే... కందిరీగ. రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో అక్ష తెలంగాణ పోరిగా కనిపించి ప్రేక్షకుల్ని నవ్వించింది. అందులో అక్ష నటన, మాట తీరు చాలా బాగుంటుంది. ఆ సినిమాతో ఇక అక్ష కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందని ఊహించారంతా. కానీ అనుకొన్నదొకటి అయ్యిందొకటి. ఆ తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోలేక ఆమె మళ్లీ వెనకబడిపోయింది. ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాల్లోనూ, చిన్న పాత్రల్లోనూ కనిపిస్తూ నేనూ ఇండస్ట్రీలో ఉన్నానని ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేసిందంతే. ఇటీవల బాలయ్య డిక్టేటర్‌లో చిన్న పాత్రలో మెరిసింది. కానీ ఆ చిత్రం ఆమె కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. మరి ఇంకోసారి అలాంటి పాత్రే దక్కిందో లేదంటే కీలకమైన పాత్రో తెలియదు కానీ... ఆఫర్‌ని మాత్రం అందుకొంది. అది శర్వానంద్ సినిమాలో. శర్వానంద్ కథానాయకుడిగా చంద్రమోహన్ అనే ఓ కొత్త దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అందులో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇదే చిత్రంలో అక్షకి కూడా ఓ కీలక పాత్ర దక్కిందట. ఆ పాత్రతోనైనా అక్ష మళ్లీ కందిరీగలా కుట్టేస్తుందేమో చూడాలి.