దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తీసిన చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రం నిర్మాణం జరిగాక కూడా కేవలం విడుదల కావడానికే చాలా కాలం పట్టింది. మొత్తానికి ఎలాగోలా విడుదలై మంచి టాక్ తోనే నడిచింది. గొప్ప చారిత్రాత్మక చిత్రంగా రుద్రమదేవి నిలిచిపోయిందనే చెప్పాలి. ఇదే చిత్రం బాహుబలికి ముందు విడుదలై ఉంటే ఈ చిత్రానికి మరోలా టాక్ వచ్చేదంటూ అప్పట్లో సినీ విమర్శకుల నుండి గుసగుసలు వినపడ్డాయి. అందుకే రుద్రమదేవిని ఆపి మరీ బాహుబలిని ముందు విడుదల చేశారని కూడా రుద్రమదేవి విడుదల సందర్భంగా సినీలోకం చెవులు కొరుక్కుంది.
అయితే ఇప్పుడు రుద్రమదేవి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే ఆ చిత్రానికి అన్నీ తానై రూపొందించిన గుణశేఖర్ ఫేస్ బుక్ ద్వారా ఓ రహస్యాన్ని తెలియజేశాడు. రుద్రమదేవి చిత్రం ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ ముందుకు ప్రవేశ పెట్టడం జరిగిపోయిందన్నాడు. ప్రతి సంవత్సరం కూడా ఆస్కార్ అవార్డు కోసమని భారతదేశం తరఫు నుండి ఓ చిత్రాన్ని అధికారికంగా ఎంపిక చేసి పంపుతుంటారు. కాగా ఈ సంవత్సరం తెలుగు నుండి రుద్రమదేవి చిత్రాన్ని ఎంపిక చేసినట్లుగా స్వయంగా గుణశేఖర్ వెల్లడించారు. కాగా ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ ముందు గత సంవత్సరం బాహుబలి కూడా వెళ్ళి వచ్చింది. కానీ అఫీషియల్ ఎంట్రీలో నిలవలేకపోయింది. కానీ రుద్రమదేవి అన్నా నిలబడుతుందేమో చూద్దాం.