భారతీయ సమాజంలో స్త్రీలను గౌరవించడం రోజు రోజుకీ తగ్గిపోతుందనే చెప్పాలి. పురుషులతో పాటు స్త్రీలకు సమాన గౌరవాదరణలు దక్కాలని నిరంతరం స్త్రీ పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. అలాగే స్త్రీలపై దాడులు, లైంగిక వేధింపులు భారతీయ సమాజంలో సర్వ సాధారణమైపోయింది. ప్రతి రోజు ఏదో ఓ చోట ఇటువంటి వేధింపులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా భారత రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ కూతురునే ఓ వ్యక్తి అంతర్జాలాన్ని వేదికగా చేసుకొని వేధించడం మొదలు పెట్టాడు. ప్రణభ్ ముఖర్జీ కూతురు షర్మిష్ఠ ముఖర్జీ గొప్ప డ్యాన్సర్. ఆమె చాలా సాధారణమైన జీవనాన్ని గడుపుతుంటుంది. అటువంటి నాట్యకారిణిని.. పార్థ మండల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్నాడు. ఈ విషయంపై షర్మష్ట గట్టిగానే స్పందించింది. తమలాంటి భద్రత కలిగిన వ్యక్తుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇక చెప్పక్కర లేదు అంటూ ఫేస్ బుక్ ద్వారా ప్రపంచానికి తెలిపింది. పార్థ మండల్ పంపిన విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఇటువంటివి బ్లాక్ చేస్తే మరోసారి బెడద ఉండదని తెలిసినా.. అలాంటివి చూసి మిన్నకుండకూడదని లోకానికి తెలిసేలా.. సభ్య సమాజంలో స్త్రీ గడ్డు పరిస్థితిని బహిర్గత పరిచింది.